Toys in Football Match: వేల సంఖ్యలో బొమ్మలను ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి విసిరిన ప్రేక్షకులు.. ఎందుకో తెలుసా?
Toys in Football Match: వేల సంఖ్యలో బొమ్మలను ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి విసిరేశారు. టర్కిష్ సూపర్ లీగ్ మ్యాచ్ లో భాగంగా ఇది జరిగింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలొ వైరల్ గా మారింది.
Toys in Football Match: ఈ మధ్య తుర్కియే (టర్కీ), సిరియాలలో వచ్చిన భారీ భూకంపం వేలాది మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలుసు కదా. ఈ మహా విషాదాన్ని ఎవరూ అంత త్వరగా మరచిపోరు. ఈ రెండు దేశాల్లో కలిపి సుమారు 50 వేల మందికిపైగా తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ భూకంప బాధితుల్లోని చిన్నారుల కోసం ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు చేసిన పని ఇప్పుడు ఎంతో మందిని ఆకర్షిస్తోంది.
టర్కిష్ సూపర్ లీగ్ లో భాగంగా బెసిక్తాస్, అంటాలియాస్పోర్ మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు.. వేల సంఖ్యలో బొమ్మలను గ్రౌండ్ లోకి విసిరారు. స్టాండ్స్ లో నుంచి వాళ్లు అలా గ్రౌండ్ లోకి బొమ్మలు విసురుతున్న వీడియో వైరల్ అయింది. ఫ్యాన్స్ ఇలా చేయడానికి వీలుగా మ్యాచ్ ను 4 నిమిషాల 17 సెకన్ల దగ్గర కాసేపు నిలిపేశారు.
మ్యాచ్ ను సరిగ్గా ఆ సమయానికి ఆపడం వెనుక కూడా ఓ కారణం ఉంది. తుర్కియే, సిరియాల్లో తొలిసారి భూకంపం ఫిబ్రవరి 6న సరిగ్గా 4:17 గంటలకు వచ్చింది. దీంతో మ్యాచ్ ను కూడా 4 నిమిషాల 17 సెకన్ల దగ్గర ఆపారు. అదే సమయంలో ప్రేక్షకులంతా బొమ్మలను గ్రౌండ్ లోకి విసిరారు. భూకంప బాధిత చిన్నారుల కోసం తమ అభిమానులు ఈ పని చేసినట్లు బెసిక్తాస్ క్లబ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈ బొమ్మ నా ఫ్రెండ్ అనే పేరుతో ఈ ఈవెంట్ నిర్వహించినట్లు తెలిపింది. ఈ గొప్ప పని చూసి బెసిక్తాస్ టీమ్ డిఫెండర్ తయ్యిబ్ సనుక్ ఎమోషనల్ అయ్యాడు. భూకంపం కారణంగా తుర్కియేకు తగిలిన గాయాలు మానడానికి వేలాది మంది ఫ్యాన్స్ ఇలా కలిసి రావడం గొప్ప విషయమని అన్నాడు.
ప్రేక్షకులు విసిరిన వేలాది బొమ్మలతో గ్రౌండ్ బౌండరీలు మొత్తం నిండిపోయాయి. వీటిని రెండు జట్లు ప్లేయర్స్ కలిసి ఒక్కచోటుకు చేర్చారు. ఈ మ్యాచ్ చివరికి గోల్ లేకుండా డ్రాగా ముగిసింది.
సంబంధిత కథనం
టాపిక్