Nikhat Zareen win Gold: చరిత్ర సృష్టించిన నిఖత్.. రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా తెలంగాణ బాక్సర్-telangana boxer nikhat zareen wins her second world boxing championships title ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Nikhat Zareen Win Gold: చరిత్ర సృష్టించిన నిఖత్.. రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా తెలంగాణ బాక్సర్

Nikhat Zareen win Gold: చరిత్ర సృష్టించిన నిఖత్.. రెండో సారి ప్రపంచ ఛాంపియన్‌గా తెలంగాణ బాక్సర్

Maragani Govardhan HT Telugu
Mar 26, 2023 07:14 PM IST

Nikhat Zareen won Gold: మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ స్వర్ణం నెగ్గింది. ఫైనల్లో వియాత్నం బాక్సర్‌ను మట్టి కరిపించి పసిడి కైవసం చేసుకుంది. ఫలితంగా నిఖత్ రెండోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది.

నిఖత్ జరీన్
నిఖత్ జరీన్ (PTI)

Nikhat Zareen won Gold: మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్.. స్వర్ణాల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటికే రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మరో పసిడిని కైవసం చేసుకుంది. 50 కిలోల విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్‌లో వియాత్నాంకు చెందిన గుయెన్ తీ టామ్‌పై 5-0 తేడాతో విజయం సాధించింది. ఫలితంగా వరుసగా రెండోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. గతేడాది కూడా నిఖత్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలవడం గమనార్హం.

నిఖత్ ఎటాకింగ్ గేమ్‌తో బౌట్‌ను ప్రారంభించింది. అయితే ప్రత్యర్థి గుయెన్ మాత్రం తన కూల్ గా ఆడినప్పటికీ తెలంగాణ బాక్సర్ మాత్రం ఎటాకింగ్ చేసింది. ప్రత్యర్థికి కాస్త దూరంగా ఉంటూ పంచుల వర్షాన్ని కురిపించిన నిఖత్ ఓపెనింగ్ రౌండులో ఆధిపత్యాన్ని చెలాయించింది. ఐదుగురు జడ్జీలు కూడా భారత బాక్సర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చారు.

ఇంక రెండో రౌండ్‌లో గుయెన్ తీ టామ్ అద్భుతంగా పుంజుకుంది. నిఖత్ డిఫెన్స్‌తో ఆ రౌండులో హోరాహోరీగా పోటీ పడింది. అయితే చివరకు ప్రత్యర్థి బాక్సర్ 3-2తో రెండో రౌండులో గెలిచింది. ఆఖరి రౌండులో బాక్సర్లిద్దరూ నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు. కానీ నిఖత్.. ప్రత్యర్థికి దూరాన్ని కొనసాగిస్తూ అఫెన్స్, డిఫెన్స్ ఇలా రెండింట్లోనూ సత్తా చాటి ప్రత్యర్థిని బోల్తా కొట్టించింది. చివరకు ఆధిక్యంలో దూసుకెళ్లి విజేతగా నిలిచింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌కు ఇది రెండో స్వర్ణం. గతేడాది 52 కేజీల విభాగంలో స్వర్ణాన్ని సాధించింది.

దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ చరిత్ర సృష్టించింది. గతేడాతి 52 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన తెలంగాణ సంచలన.. ఈ ఏడాది 50 కేజీల విభాగంలో పసిడిని కైవసం చేసుకుంది. శనివారం నాడు భారత్ రెండు స్వర్ణాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 48 కేజీల విభాగంలో నీతు గాంగాస్ 5-0 తేడాతో లుత్సాయిఖాన్‌ను(మంగోలియా) ఓడించగా.. 81 కేజీల విభాగంలో స్వీటి 4-3 తేడాతో వాంగ్ లీనాపై(చైనా) నెగ్గింది.

Whats_app_banner

టాపిక్