Nikhat Zareen Medal: నిఖత్ జరీన్‌కు మెడల్ ఖాయం.. వరల్డ్ ఛాంపియన్‌షిప్ సెమీస్ చేరిన బాక్సర్
Nikhat Zareen Medal: నిఖత్ జరీన్‌కు మెడల్ ఖాయమైంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ బాక్సింగ్ సెమీస్ చేరిందీ తెలంగాణ బాక్సర్. 50 కేజీల విభాగంలో ఆమె డిఫెండింగ్ ఛాంపియన్ అన్న విషయం తెలిసిందే.

Nikhat Zareen Medal: ఇండియన్ బాక్సర్ నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మరో మెడల్ ఖాయం చేసింది. అంతకుముందే నీతూ మెడల్ ఖాయం చేయగా.. నిఖత్ కూడా సెమీస్ చేరి మరో మెడల్ ను ఖాయం చేయడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో 26 ఏళ్ల నిఖత్.. రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ మెడలిస్ట్ అయిన చూతామత్ రక్సత్ ను ఓడించింది.
ఈ క్వార్టర్స్ బౌట్ లో నిఖత్ 5-2తో విజయం సాధించింది. అయితే ఫైనల్ జడ్జ్‌మెంట్ కు ముందు చాలా డ్రామా నడిచింది. ఇద్దరు బాక్సర్లు రింగ్ మధ్యలో రెండు నిమిషాల పాటు నిల్చోవాల్సి వచ్చింది. అంతకుముందు ఛాంపియన్‌షిప్ లో మూడు రౌండ్లు పూర్తిగా డామినేట్ చేసిన నిఖత్.. ఈ క్వార్టర్స్ లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది.
దీంతో చివరి వరకూ విజేత ఎవరు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. చివరికి తనను విజేతగా ప్రకటించడంతో నిఖత్ ఊపిరి పీల్చుకుంది. గతేడాది వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచి నిఖత్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతేడాది ఇస్తాంబుల్ లో జరిగిన ఈ ఛాంపియన్ షిప్ 50 కేజీల విభాగంలో విజయం సాధించింది.
గతేడాది కామన్వెల్త్ గేమ్స్ లోనూ నిఖత్ గోల్డ్ గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో ఇప్పటికే ఇండియాకు నీతూ (48 కేజీలు), సవీటీ బూరా (81 కేజీ)లు కూడా సెమీఫైనల్స్ చేరారు. ఆ రెండు మెడల్స్ తోపాటు ఇప్పుడు నిఖత్ మూడో మెడల్ ఖాయం చేసింది.
టాపిక్