Pakistan vs Sri Lanka Asia cup: పాకిస్థాన్‌పై శ్రీలంక ఘన విజయం.. ఫైనల్‌కు ముందు లంక అదుర్స్-sri lanka won by 5 wickets against pakistan in asia cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pakistan Vs Sri Lanka Asia Cup: పాకిస్థాన్‌పై శ్రీలంక ఘన విజయం.. ఫైనల్‌కు ముందు లంక అదుర్స్

Pakistan vs Sri Lanka Asia cup: పాకిస్థాన్‌పై శ్రీలంక ఘన విజయం.. ఫైనల్‌కు ముందు లంక అదుర్స్

Maragani Govardhan HT Telugu
Sep 10, 2022 06:36 AM IST

Pakistan vs Sri Lanka: పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ చివరి మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ నిశాంక అర్ధశతకంతో(55) ఆకట్టుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

<p>పాక్ పై లంక విజయం</p>
పాక్ పై లంక విజయం (AP)

Pakistan vs Sri Lanka Adia cup 2022: పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ చివరి సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో పాక్‌పై గెలిచింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ సత్తా చాటి విజయాన్ని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లంక జట్టు 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లంక ఓపెనర్ పాథుమ్ నిశాంక(55) అర్దశతకంతో ఆకట్టుకోవడంతో విజయాన్ని ఖరారు చేసుకుంది. అయితే ఈ గెలుపు వల్ల ఇరు జట్లపై ఎలాంటి ప్రభావముండదు. ఎందుకంటే ఈ రెండు ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం జరగనున్న ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి.

122 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంకకు శుభారంభమేమి దక్కలేదు. మొదటి ఓవర్లోనే ఓపెనర్ కుశాల్ మెండీస్ వికెట్‌(0) తీశాడు పాక్ బౌలర్ మహమ్మద్ హౌసెన్. ఆ తర్వాతి ఓవర్లోనే ధనుష్క గుణతిలక(0) వికెట్‌‌ను తీసి ఘోరంగా దెబ్బంగా కొట్టాడు హ్యారిస్ రౌఫ్. అప్పటికి జట్టు స్కోరు 2 పరుగులే. 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది శ్రీలంక. పాథుమ్ నిశాంక ఒక్కడే క్రీజులో నిలుచున్నప్పటికీ స్కోరు వేగం తగ్గింది. ఐదో ఓవర్లో ధనంజయ్ డిసిల్వా(9) కూడా ఔట్ కావడంతో 29 పరుగులకే టాపార్డర్ అంతా పెవిలియన్ చేరింది.

ఇలాంటి సమయంలో నిశాంక-భానుక రాజపక్స ఆదుకున్నారు. రాజపక్స(24) సాయంతో నిశాంక స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ నిలకడగా ఆడారు. లక్ష్యం పెద్దగా లేకపోవడంత వారి పని సులభమైంది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం ఉస్మాన్ ఖాదర్ బౌలింగ్‌లో రాజపక్స ఔట్ కాగా.. కెప్టెన్ శనకా(21) క్రీజులోకి వచ్చాడు.

శనకా సాయంతో నిశాంక లక్ష్యానికి చేరువ చేశాడు. ఈ క్రమంలోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. ఇంకో 9 పరుగులు చేస్తే విజయం అందుతందనగా శనకా మహమ్మద్ హోసెన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే అప్పటికే విజయం దాదాపు ఖరారైంది. హసరంగా(10) సాయంతో మరో మూడు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించడంలో నిశాంక తోడ్పడ్డాడు. ఫలితంగా లంక జట్టు 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ హొసేన్, హ్యారిస్ రౌఫ్ చెరో రెండు వికెట్లు తీయగా.. ఉస్మాన్ ఖాదర్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాక్.. 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బాబర్(30), నవాజ్(26) మినహా మిగిలినవారి విఫలమవడంతో తక్కువ స్కోరుకే ఆలైటంది. శ్రీలంక బౌలర్లలో హసరంగా 3 వికెట్లు తీయగా.. తీక్షణ, ప్రమోద్ చెరో 2 వికెట్లతో ఆకట్టుకున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్