IPL 2022 | సన్‌రైజర్స్ జోరు కొనసాగిస్తుందా...పంజాబ్ గెలుస్తుందా...
హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ నేడు తలపడనున్నది. ఇరు బలాలు సమానంగా ఉన్న నేపథ్యంలో గెలుపు ఎవరిదన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఐపీఎల్ లో ఈ ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్‌కింగ్స్ మధ్య రసవత్తరమైన పోరు జరుగబోతున్నది. ఓటములతో ఐపీఎల్ సీజన్‌ను ప్రారంభించిన సన్‌రైజర్స్ తిరిగి గాడిన పడింది. హ్యాట్రిక్ గెలుపులతో జోరుమీదున్నది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ రెచ్చిపోతున్నది. కెప్టెన్ విలియమ్సన్‌తో పాటు అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, పూరన్, మార్‌క్రమ్ సమిష్టిగా బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోరుకు బాటలు వేస్తున్నారు. ఒకరు విఫలమైన మరొకరు ఆదుకుంటున్నారు. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచుల్లో వీరే తమ బ్యాటింగ్‌తో జట్టును గట్టెక్కించారు. మరోసారి పంజాబ్‌పై చెలరేగేందుకు సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ సిద్ధమవుతోంది. బౌలింగ్‌లో మాత్రం పేస్‌దళం భువనేశ్వర్, నటరాజ్, ఉమ్రాన్‌మాలిక్ వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు ఇవ్వడమే ప్రధాన సమస్యగా మారుతోంది. పరుగులు కట్టడి చేయడంపై దృష్టిపెడితే బాగుంటుంది.
శిఖర్ ధావన్, మయాంక్ పైనే భారం
ఈ సీజన్‌లో పంజాబ్ ప్రయాణం ఓ గెలుపు, మరో ఒటమి అన్న చందంగా సాగుతుంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో రెండింటిలో ఓడిపోయి మూడింటిలో గెలిచింది. బ్యాటింగ్‌లో మయాంక్ అగర్వాల్, శిఖర్‌ధావన్‌పైనే అధికంగా పంజాబ్ ఆధారపడుతోంది. వారి ఆటతీరుపైనే పంజాబ్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మిడిల్ ఆర్డర్‌లో లివింగ్‌స్టోన్, షారుఖ్‌ఖాన్ భారీ షాట్లతో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడే సామర్థ్యం ఉన్నవారు కావడం పంజాబ్‌కు కలిసివస్తోంది. పంజాబ్ బౌలింగ్ కూడా గొప్పగాలేదు. రబాడ, రాహుల్ చాహర్ మినహా మిగిలిన వారు పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్