Sourav Ganguly on Virat Kohli: కోహ్లీ.. ఇలా చెయ్.. ఫామ్‌లోకి వస్తావ్: గంగూలీ
Sourav Ganguly on Virat Kohli: ఫామ్ కోసం తంటాలు పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి కీలకమైన సూచన చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అతనికి అండగా నిలిచాడు.
లండన్: విరాట్ కోహ్లి ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాడు. కాకపోతే ఒకప్పుడు అతడి రికార్డుల గురించి మాట్లాడుకునే వాళ్లు ఇప్పుడు అతడి చెత్త ఫామ్ గురించి చర్చించుకుంటున్నారు. అతన్ని టీమ్‌లో నుంచి తీసేయాలని.. లేదు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మాజీ క్రికెటర్లు ఈ విషయంలో రెండుగా చీలిపోయారు. అయితే ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీయే కోహ్లికి అండగా నిలుస్తున్నారు.
అంతేకాదు అతడు ఫామ్‌లోకి రావాలంటే ఏం చేయాలో చెబుతున్నారు. కోహ్లికి ఒక్కడికే కాదు.. గతంలో ఎంతోమందికి ఇలాగే జరిగింది.. భవిష్యత్తులోనూ మరెంతో మందికి జరుగుతుందని విరాట్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. "కచ్చితంగా అతడు ఫామ్‌లోకి వస్తాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతడి నంబర్స్ చూడండి. సామర్థ్యం, నైపుణ్యం లేకుండా అవి సాధ్యం కావు.
ప్రస్తుతం అతడు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అది అతనికి కూడా తెలుసు. అతడో గొప్ప ప్లేయర్. తన ప్రమాణాలేంటో అతనికి తెలుసు. అతడు కచ్చితంగా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని నాకు నమ్మకం ఉంది. కానీ అతడు సక్సెస్ కావడానికి ఓ దారి వెతుక్కోవాలి. గత 12,13 ఏళ్లుగా అతడు చేస్తున్నది అదే. చేస్తాడు కూడా" అని ఏఎన్‌ఐతో మాట్లాడుతూ గంగూలీ అన్నారు.
"స్పోర్ట్స్‌లో ఇలాంటివి సాధారణమే. ప్రతి ఒక్కరికీ జరిగింది. సచిన్‌కు జరిగింది, రాహుల్‌కు జరిగింది, నాకు జరిగింది. విరాట్‌కూ జరుగుతోంది. భవిష్యత్తు ప్లేయర్స్‌కు కూడా జరుగుతుంది. ఇది ఆటలో భాగం. ఓ ప్లేయర్ దీనిని అర్థం చేసుకొని, తన ఆట తాను ఆడాలి" అని గంగూలీ స్పష్టం చేశారు. ఎన్నో అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్న విరాట్ కోహ్లికి ఈ ఏడాది అక్టోబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు దక్కుతుందా లేదా అన్నది సందేహంగా మారింది.
సంబంధిత కథనం