Sania Mirza: నేను అబ్బాయి అయి ఉంటే క్రికెట్ ఆడేదాన్నేమో: సానియా
Sania Mirza: నేను అబ్బాయి అయి ఉంటే క్రికెట్ ఆడేదాన్నేమో అని సానియా మీర్జా చెప్పింది. ఈ మధ్యే టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె.. జియో సినిమాలో క్రికెటర్ వేదా కృష్ణమూర్తితో మాట్లాడింది.
Sania Mirza: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానిమా మీర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను అబ్బాయిగా పుట్టి ఉంటే క్రికెట్ ఆడేదాన్నేమో అని ఆమె అనడం గమనార్హం. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ లో తన చివరి మ్యాచ్ ఆడి కెరీర్ కు గుడ్ బై చెప్పిన సానియా.. తాజాగా క్రికెటర్ వేదా కృష్ణమూర్తితో కలిసి జియో సినిమాలో మాట్లాడింది.
ఆరు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలిచిన సానియా.. తాను కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో అమ్మాయిలు క్రికెట్ కు పనికిరారు అన్న భావన సమాజంలో ఉండేదని చెప్పడం గమనార్హం. "నిజాయతీగా చెబుతున్నాను. ఇది మీకు చెప్పాల్సిన విషయం కాదని తెలుసు. నేను అబ్బాయి అయి ఉంటే క్రికెట్ ఆడేదాన్నమో. ఓ అమ్మాయిగా క్రికెట్ ఆడటం పూర్తిగా భిన్నం. కదా? నిజానికి ఏదైనా ఆట ఆడటమే భిన్నం. నేను అమ్మాయి కాబట్టి క్రికెట్ వాళ్లకు సరిపడదు అని అనుకునేవాళ్లు. కానీ 30 ఏళ్ల కిందట అలాగే ఉండేది" అని సానియా చెప్పింది.
తన రోల్ మోడల్ స్టెఫీ గ్రాఫ్ అని కూడా ఈ సందర్భంగా ఆమె తెలిపింది. స్టెఫీ తన కెరీర్లో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది. ఇక తాను ఎదిగే క్రమంలో ఇండియాలో పీటీ ఉష తప్ప మరో మహిళా అథ్లెట్ తనకు కనిపించలేదని చెప్పింది. 2004లో జూనియర్ వింబుల్డన్ టైటిల్ గెలిచి సంచలనం సృష్టించిన సానియా.. 2007లో సింగిల్స్ లో కెరీర్ అత్యుత్తమ 27వ ర్యాంక్ అందుకుంది.
"నా రోల్ మోడల్ కేవలం స్టెఫీ గ్రాఫ్ మాత్రమే. నేను పెరిగే సమయంలో మన దేశంలో పీటీ ఉష తప్ప అమ్మాయిల్లో మరో అథ్లెట్ నాకు కనిపించలేదు. మన ఉపఖండంలో ప్రతి ఇంటికీ ఆమె పేరు తెలుసు. ఓ అథ్లెట్ గా ఎదగాలంటే పీటీ ఉషలాగా కావాలి అని అనుకునేవాళ్లు" అని సానియా చెప్పింది.
టాపిక్