India vs Australia 2nd ODI: వన్డేల్లో రోహిత్ పేరిట చెత్త రికార్డు.. స్వదేశంలో తొలి ఓటమి
India vs Australia 2nd ODI: ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓడిపోవడంతో రోహిత్ శర్మ కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు. పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత వన్డేల్లో స్వదేశంలో తొలి ఓటమిని అందుకున్నాడు.
India vs Australia 2nd ODI: వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత టాపార్డర్ ఘోరంగా విఫలమవడంతో జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమమైంది. ముందు బౌలింగ్‌లో సత్తా చాటిన ఆసీస్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో పరాజయంతో రోహిత్ సేన చెత్త రికార్డును తన సొంతం చేసుకుంది.
టీమిండియా నిర్దేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 11 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో వన్డే క్రికెట్‌లో భారత్ నిర్దేశించిన టార్గెట్‌ను అత్యంత వేగవంతమైన లక్ష్య ఛేదనగా రికార్డు సృష్టించింది. రోహిత్ సేనకు ఇది అవాంఛిత రికార్డు. గతంలో టీమిండియా నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని 14.4 ఓవర్లలో న్యూజిలాండ్ ఛేదించింది. తాజాగా ఆస్ట్రేలియా ఆ రికార్డును అధిగమించింది.
అంతేకాకుండా రోహిత్ కెప్టెన్సీ కెరీర్‌లో స్వదేశంలో టీమిండియా ఓడిపోయిన రెండో మ్యాచ్ ఇది. ఆరేళ్ల క్రితం 2017లో అప్పటి కెప్టెన్ కోహ్లీ గైర్హాజరుతో హిట్ మ్యాన్ పగ్గాలు చేపట్టగా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. రోహిత్ రెగ్యూలర్ కెప్టెన్ అయిన తర్వాత భారత్ ఇప్పటి వరకు మూడు వన్డేల్లో మాత్రమే ఓడిపోయింది. పూర్తి స్థాయి కెప్టెన్ అయిన తర్వాత రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌తో జరిగిన ఒక్క వన్డే సిరీస్‌లోనే టీమిండియా ఓడింది. స్వదేశంలో అయితే ఇదే మొదటిది.
తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోరంగా పరాజయం పాలైంది. . 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఓపెనర్లే ఛేదించి 10 వికెట్ల తేడాతో తమ జట్టుకు ఘనవిజయాన్ని అందించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(51), మిచెల్ మార్ష్(66) అర్ధశతకాలతో విజృంభించి స్వల్ప లక్ష్యాన్ని 11 ఓవర్లలోనే ఛేదించారు. ఆసీస్ బౌలర్లు విజృంభించిన పిచ్‌పై భారత బౌలర్లు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. అంతకు ముందు బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో విజృంభించాడు.