Ind vs Aus 2nd ODI: ఆసీస్ చేతిలో భారత్ చిత్తు.. 10 వికెట్లతో ఘోర పరాజయం
Ind vs Aus 2nd ODI: విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోరంగా ఓడిపోయింది. అన్ని విభాగాల్లోనూ రాణించిన ఆసీస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని ఓపెనర్లే ఛేదించారు.
Ind vs Aus 2nd ODI: తొలి వన్డేలో విజయాన్ని అందుకున్న భారత్.. రెండో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అచ్చి వచ్చిన పిచ్ మీద అసలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఓపెనర్లే ఛేదించి 10 వికెట్ల తేడాతో తమ జట్టుకు ఘనవిజయాన్ని అందించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(51), మిచెల్ మార్ష్(66) అర్ధశతకాలతో విజృంభించి స్వల్ప లక్ష్యాన్ని 11 ఓవర్లలోనే ఛేదించారు. ఆసీస్ బౌలర్లు విజృంభించిన పిచ్‌పై భారత బౌలర్లు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఫలితంగా సిరీస్1-1తో సమమైంది. నిర్ణయాత్మక మూడో వన్డే చెన్నై వేదికగా మార్చి 22న జరగనుంది.
118 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లే లక్ష్యంగా పరుగుల వరద పారించారు. ముఖ్యంగా గత మ్యాచ్‌లో అదరగొట్టిన మిచెల్ మార్ష్ ఈ వన్డేలోనూ ఆకట్టుకున్నాడు. వరుసపెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్వల్ప లక్ష్యాన్ని మరింత చిన్నది చేశాడు. సగటును 11 పరుగుల రన్ రేట్ చొప్పున బ్యాటింగ్ చేసి టీ20ని తలపించాడు మార్ష్. 36 బంతుల్లో 66 పరుగులతో అదరగొట్టాడు. ఇందులో ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లు ఉన్నాయి.
మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మార్ష్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే ట్రావిస్ హెడ్ అద్భుత ఆటతీరుతో అదరగొట్టాడు. 30 బంతుల్లో 51 పరుగులతో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఇందులో 10 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరే లక్ష్యాన్ని ఛేదించి భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వలేదు. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించిన పిచ్‌పై మన పేసర్లు తేలిపోయారు. ముఖ్యంగా సిరాజ్ 3 ఓవర్లలో 37 పరుగుల సమర్పించేశాడంటే ఏ విధంగా బ్యాటింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ స్టార్ పేసర్ స్టార్క్ ధాటికి టీమిండియా టాపార్డర్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టింది. అతడు 5 వికెట్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విరాట్ కోహ్లీ చేసిన 31 పరుగులే అత్యధిక వ్యక్తిత స్కోరు. అక్షర్ పటేల్ మోస్తరుగా రాణించినప్పటికీ అతడు కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. స్టార్క్‌కు అబాట్ 3 వికెట్లతో రాణించడంతో ఆసీస్ పని తేలికైంది.