Rishabh Pant Discharge : ఈ వారంలోనే ఆసుపత్రి నుంచి రిషబ్ పంత్ డిశ్ఛార్జ్
Rishabh Pant Health Update : యువ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది.
క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant)కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దిల్లీ-డెహ్రాడూన్ ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో రిషబ్ పంత్ పెద్ద రోడ్డు ప్రమాదానికి(Car Accident) గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డాడు. అతడి శరీరంపై కాలిన గాయాలు అయ్యాయి. డిసెంబర్ 30న ఈ ఘటన జరిగింది.
మొదట డెహ్రాడూన్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి పంత్ ను తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం.. ముంబయిలోని ధీరూబాయి కోకిలాబెన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పంత్ కు పలు సర్జరీలు చేశారు వైద్యులు. మోకాలి లిగమెంట్ కు శస్త్రచికిత్స చేయించుకున్న పంత్ పరిస్థితి మెరుగుపడుతోంది. ఈ వారంలో అతడిని డిశ్ఛార్జ్ చేయనున్నారు.
రిషబ్ కోలుకుంటున్నాడని డాక్టర్లు చెబుతున్నారు.'సర్జరీ విజయవంతమైంది. ఈ వారంలోనే రిషబ్ డిశ్చార్జ్ అవనున్నాడు.' అని బీసీసీఐ(BCCI) అధికారి ఒకరు చెప్పారు. పంత్ మోకాలి లిగమెంట్లకు సంబంధించి.. మార్చిలో మరో సర్జరీ కూడా చేయనున్నారు. రిషబ్ త్వరలోనే పూర్తిగా కోలుకుని వస్తాడని ఆశిస్తున్నామని బీసీసీఐ అధికారి అన్నారు. మైదానంలోకి వచ్చేందుకు 8, 9 నెలల సమయం పట్టొచ్చని తెలిపారు.
ఇటీవలే పంత్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. కోలుకోవడం గురించి చెప్పుకొచ్చాడు. 'అందరి మద్దతుకు, నా మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞుడను. నా శస్త్రచికిత్స విజయవంతమైందని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. కోలుకునే సమయంలో ఉన్నాను. ఉత్సాహంగానే ఉన్నాను. ఈ క్లిష్ట సమయంలో మీ మంచి మాటలు, మద్దతుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.' అని రిషబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపాడు.
గాయాలు ఎక్కువగా ఉన్న కారణంగా.. 2023లో క్రికెట్ ఆటకు దూరంగా ఉండనున్నాడు పంత్. ఎంతగానో ఎదురుచూసిన.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా పంత్ ఆడటం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023 సీజన్‌కు సైతం దూరంగానే ఉండనున్నాడు. అక్టోబర్-నవంబర్‌లో భారతదేశంలో జరగనున్న 2023 ODI ప్రపంచ కప్(World Cup)కు పంత్ దూరంగానే ఉంటాడు.
పంత్ ఐపీఎల్(IPL)లో ఆడటం చాలా కష్టం. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)న తరఫున ఉన్నాడు. రిషబ్ పూర్తిగా కోలుకునేందుకు ఇంకా 8 నెలల సమయం పట్టే అవకాశం ఉందని.. వైద్యులు అంటున్నారు. మళ్లీ క్రికెట్(Cricket) ఆడేందుకు ఏడాది పట్టే ఛాన్స్ ఉంది. త్వరగా కోలుకుని.. జట్టులో ఆట కొనసాగించాలని అందరూ కోరుకుంటున్నారు. పంత్ చికిత్సకు అయ్యే ఖర్చును బీసీసీఐ చూసుకుంటోంది.