Ranveer Singh Attend FIFA 2022: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు రణ్‌వీర్.. ఎప్పుడంటే?-ranveer singh to attend fifa world cup 2022 finals in qatar ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ranveer Singh To Attend Fifa World Cup 2022 Finals In Qatar

Ranveer Singh Attend FIFA 2022: ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు రణ్‌వీర్.. ఎప్పుడంటే?

Maragani Govardhan HT Telugu
Nov 16, 2022 09:12 AM IST

Ranveer Singh Attend FIFA 2022: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు హాజరు కానున్నాడు. నవంబరు 20 నుంచి ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో 32 జట్లు పోటీ పడుతున్నాయి. డిసెంబరు 18 వరకు ఈ టోర్నీ జరగనుంది.

రణ్‌వీర్ సింగ్
రణ్‌వీర్ సింగ్ (AP)

Ranveer Singh Attend FIFA 2022: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ సినిమాల్లో ఎంత బాగా నటిస్తారో.. ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఉత్సాహంగా చురుకుగా ఉంటూ చుట్టూ ఉన్నవారికి వినోదాన్ని అందిస్తూ ఉంటారు. ఫలితంగా ఆయన గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా అది పెద్ద ట్రెండ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఏడాది అతడు చేసిన న్యూడ్ ఫొటోషూట్ ఎంత పెద్ద చర్చనీయాంశమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి వివాదంతో కాదులేండి.. ఖతర్ వేదికగా జరగనున్న ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌కు హాజరుకానున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఖతర్ వేదికగా ఫిఫా ప్రపంచకప్ 2022 జరగనున్న సంగతి తెలిసిందే. నవంబరు 20 నుంచి డిసెంబరు 18 వరకు ఈ టోర్నీ జరగనుంది. చివరి రోజు జరగనున్న ఫైనల్ వేడుకకు భారత్ తరఫున బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. బాలీవుడ్ మీడియా వర్గాల ప్రకారం.. రణ్‌వీర్ ప్రపంచకప్ ఫైనల్‌కు మాత్రమే కాకుండా.. వరల్డ్ కప్ ఫుట్‌బాల్ దిగ్గజాలతోనూ సమావేశమవనున్నాడని సమాచారం. మీడియా నివేదికల కథన ప్రకారం అతడు ప్రపంచ వ్యాప్తంగా భారత యువతకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడట. ప్రపంచకప్ ఫైనల్స్‌కు అతడు హాజరు కావడమే కాకుండా ఫుట్‌బాస్ ఐకాన్స్‌తో సమావేశమవున్నాడట. ఫైనల్ తర్వాత జరిగే ముగింపు వేడుకలోనూ పాల్గొననున్నాడని తెలుస్తోంది.

నవంబరు 20 నుంచి జరగనున్న ఫిఫా ప్రపంచకప్.. మొత్తంగా 22వ ఎడిషన్. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆసియా దేశంలో నిర్వహించడం ఇది రెండోసారి. మొట్టమొదటి సారిగా 2002లో దక్షిణ కొరియా-జపాన్ సంయుక్తంగా నిర్వహించాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే నిర్వహించడం. అలాగే అరబ్ దేశం ఫిఫా వరల్డ్ కప్‌నకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 32 జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. 2026లో ఫిఫా ప్రపంచకప్‌ను అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. అక్కడ 48 జట్లు పోటీపడనున్నట్లు తెలుస్తోంది.

ఇక రణ్‌వీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా కరణ్ జోహార్ దర్శకత్వంలో రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఇందులో గల్లీ బాయ్ తర్వాత ఆలియా భట్‌తో మరోసారి నటించాడు.

WhatsApp channel

సంబంధిత కథనం