Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో శుభారంభం చేసిన పీవీ సింధు.. మనూ భాకర్‌పై స్వర్ణ పతక ఆశలు
Paris Olympics 2024 - PV Sindhu: భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. పారిస్ ఒలింపిక్స్ 2024లో శుభారంభం చేశారు. తొలి రౌండ్‍లో అలవోకగా గెలిచారు. మరోవైపు షూటింగ్‍లో ఇండియన్ షూటర్ మనూ భాకర్ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో తన సమరాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, తెలుగమ్మాయి పీవీ సింధు ఆరంభించారు. ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు గెలిచిన సింధుపై మరోసారి భారీ ఆశలు ఉన్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, గత టోక్యో ఒలింపిక్ క్రీడల్లో కాంస్యం సాధించిన సింధు.. ఈసారి పారిస్‍లో పసిడి సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ లక్ష్యం దిశగా సింధు తొలి అడుగువేశారు. పారిస్ ఒలింపిక్స్ రెండో రోజు నేడు (జూలై 28) జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ మ్యాచ్‍లో విజయం సాధించి.. శుభారంభం చేశారు.
సింధు ఆధిపత్య గెలుపు
మహిళల సింగిల్స్ గ్రూప్-ఎం మ్యాచ్‍లో ఇండియన్ స్టార్ పీవీ సింధు 21-9, 21-6 తేడాతో మాల్దీవ్స్ ప్లేయర్ ఫాతిమా అబ్దుల్‍పై అలవోక విజయం సాధించారు. మ్యాచ్ అంతా ఆధిపత్యం ప్రదర్శించారు. వరుస గేమ్‍లను కైవసం చేసుకొని 29 నిమిషాల్లోనే సింధు సునాయాసంగా గెలిచారు.
సింధు ఆరంభం నుంచే పూర్తి దూకుడుగా ఆడారు. ప్రత్యర్థి ఫాతిమాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుసగా పాయింట్లు సాధించారు. దీంతో 13 నిమిషాల్లోనే తొలి గేమ్ ముగిసింది. రెండో రౌండ్లో పీవీ సింధు మరింత జోరు పెంచారు. ఓ దశలో 4-3తో నిలిచినా మళ్లీ అటాక్ చేశారు. వేగంగా 10-3 ఆధిక్యంలోని భారత స్టార్ దూసుకెళ్లారు. అదే ఆటతో రెండే గేమ్ కూడా గెలిచారు.
ఈ గ్రూప్‍లో తదుపరి మ్యాచ్‍లో ఇస్టోనియాకు చెందిన కే కుబాతో సింధు తలపడనున్నారు. జూలై 31వ తేదీన ఈ మ్యాచ్ ఉండనుంది.
పారిస్ ఒలింపిక్స్ కోసం సింధు చాలా సిద్ధమయ్యారు. ఈ క్రీడల్లో మెడల్ గెలిచి హ్యాట్రిక్ సృష్టించాలని పట్టుదలగా ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే.. వ్యక్తిగత విభాగంలో మూడు ఒలింపిక్స్ పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా సింధుకు హిస్టరీ క్రియేట్ చేస్తారు.
స్వర్ణంపై మనూ భాకర్ గురి
భారత స్టార్ షూటర్ మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో ఫైనల్ చేరుకున్నారు. మహిళల వ్యక్తిగత షూటింగ్ విభాగంలో ఫైనల్ చేరి తొలి భారత షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. మనూ భాకర్ ఫైనల్ నేడే (జూలై 28) జరగనుంది. మనూ స్వర్ణం సాధిస్తే.. ఈ ఘనత దక్కించుకున్న తొలి మహిళా షూటర్‌గా మరో ఘనమైన హిస్టరీ క్రియేట్ చేస్తారు. దీంతో ఈ ఫైనల్‍పై చాలా ఆసక్తి ఉంది.
టోక్యో ఒలింపిక్స్‌లో గన్ మాల్‍ఫంక్షన్ వల్ల క్వాలిఫికేషన్లలోనే మనూ భాకర్ ఔట్ అయ్యారు. దీంతో అప్పుడు ఆమె కన్నీళ్లు పెటుకున్నారు. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరారు. ఈసారి ఆమె స్వర్ణం సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.