National Sports Awards 2023: తెలుగు బ్యాడ్మింటన్ ప్లేయర్‌కు జాతీయ అత్యున్నత క్రీడా పురస్కారం.. షమీకి అర్జున
National Sports Awards 2023: జాతీయ క్రీడాఅవార్డులను క్రీడామంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2023కుగాను అవార్డులను ఖరారు చేసింది. తెలుగు బ్యాడ్మింటన్ ప్లేయర్‌కు ఖేల్ రత్న అవార్డు దక్కింది. ఆ వివరాలివే..
National Sports Awards 2023: భారత స్టార్ బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్, తెలుగు ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డిని దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‍చంద్ ఖేల్‍రత్న’ అవార్డు వరించింది. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో అతడితో కలిసి ఆడుతున్న చిరాగ్ శెట్టిని కూడా ఈ పురస్కారం దక్కింది. 2023కు గాను ఇద్దరికీ కలిపి ఖేల్‍రత్న అవార్డు దక్కింది. జాతీయ క్రీడా అవార్డులు-2023ను క్రీడా మంత్రిత్వ శాఖ నేడు (డిసెంబర్ 20) ప్రకటించింది.
కొన్నేళ్లుగా బ్యాడ్మింటన్‍లో భారత్ తరఫున పురుషుల డబుల్స్‌లో అద్భుత విజయాలు సాధిస్తున్న సాత్విక్, చిరాగ్ జోడీగా 2023కు గాను ఖేల్ రత్న అవార్డు దక్కింది. భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సహా మొత్తంగా 26 మందికి రెండో అత్యున్నత పురస్కారం ‘అర్జున’ దక్కింది. 2024 జనవరి 9న రాష్ట్రపతి భవన్‍లో జరిగే కార్యక్రమంలో అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించనున్నారు. కాగా, ఖేల్‍రత్న దక్కించుకున్న స్వాతిక్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‍లోని అమలాపురం.
తెలంగాణ నుంచి ఇద్దరికి అర్జున
తెలంగాణకు చెందిన బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్‍కు అర్జున అవార్డు దక్కింది. అలాగే, తెలంగాణ షూటర్ ఇషా సింగ్‍ను కూడా అర్జున పురస్కారం వరించింది. వీరిద్దరినీ అభినందిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.
2023కు గాను జాతీయ క్రీడా అవార్జులను దక్కించుకున్న వారి జాబితా ఇదే..
మేజర్ ధ్యాన్‍చంద్ ఖేల్‍రత్న అవార్డు: సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్)
అర్జున్ అవార్డులు: మహమ్మద్ షమీ (క్రికెట్), మహమ్మద్ హుసాముద్దీన్ (బాక్సింగ్), ఓజాస్ ప్రవీణ్ దియోతలే (ఆర్చరీ), అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ), మురళీ శ్రీశంకర్ (అథ్లెటిక్స్), పారుల్ చౌదరీ (అథ్లెటిక్స్), ఆర్ వైశాలీ (చెస్), అనుష్ అగర్వాల్ (ఈక్వెస్ట్రియన్), దివ్యాకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెసెజ్), దిశా దాగర్ (గోల్ఫ్), కృషణ్ బాదుర్ పాఠక్ (హాకీ), సుశీలా చానూ (హాకీ), పవన్ కుమార్ (కబడ్డీ), రితూ నేగీ (కబడ్డీ), నస్రీన్ (ఖోఖో), పింకీ (లా బౌల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఈశా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్), ఐహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్ (రెజ్లింగ్), అంతిమ్ (రెజ్లింగ్), రషిబినా దేవి (వుషు), శీతవ్ దేవీ (పారా అర్చరీ), ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్), ప్రాచీ యాదవ్ (పారా కనోయింగ్).
ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్) దక్కించుకున్న కోచ్‍లు: లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్బీ రమేశ్ (చెస్), మహవీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్ (హాకీ), గణేషన్ ప్రభాకర్ (మల్లఖంబ్)
ద్రోణాచార్య అవార్డ్ (లైఫ్ టైమ్ క్యాటగిరీ): జస్‍కీరత్ సింగ్ (గోల్ఫ్), భాస్కరన్ ఈ (కబడ్డీ), జయంత కుమార్ పుషిలాల్ (టేబుల్ టెన్నిస్)
ధ్యాన్‍చంద్ లైఫ్ టైమ్ అచీవ్‍మెంట్ అవార్డు: మన్జూషా కన్వార్ (బ్యాడ్మింటన్), వినీత్ కుమార్ శర్మ (హాకీ), కవిత సెల్వరాజ్ (కబడ్డీ)