MIW vs RCBW: బెంగళూరును చిత్తుగా ఓడించిన ముంబయి.. 9 వికెట్లతో భారీ విజయం -mumbai indians women won by 9 wickets against royal challengers bangalore women ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Miw Vs Rcbw: బెంగళూరును చిత్తుగా ఓడించిన ముంబయి.. 9 వికెట్లతో భారీ విజయం

MIW vs RCBW: బెంగళూరును చిత్తుగా ఓడించిన ముంబయి.. 9 వికెట్లతో భారీ విజయం

Maragani Govardhan HT Telugu
Mar 07, 2023 05:45 AM IST

MIW vs RCBW: బ్రబౌర్న్ స్టేడియం వేదికగా బెంగళూరుతో జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఘన విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఓ వికెట్ కోల్పోయి 14.2 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ అద్భుత అర్ధశతకంతో అదరగొట్టింది.

ఆర్సీబీపై ముంబయి విజయం
ఆర్సీబీపై ముంబయి విజయం (PTI)

MIW vs RCBW: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తు చేసిన ముంబయి ఈ సారి బెంగళూరు పనిపట్టింది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై 9 వికెట్ల తేడాతో భారీ సక్సెస్‌ను అందుకుంది. బెంగళూరు నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఓ వికెట్ కోల్పోయి 14.2 ఓవర్లలో ఛేదించింది. ముంబయి ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్(77), న్యాట్ స్క్రైవర్ బ్రంట్(55) అర్థశతకాలతో చెలరేగి తమ జట్టుకు అద్బుత గెలుపును అందించారు. బెంగళూరు బౌలర్లలో ప్రీతి బోస్ మాత్రమే ఓ వికెట్ తీయగలిగింది.

156 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఓ మోస్తరు శుభారంభమే దక్కింది. ఐదో ఓవర్లో ఓపెనర్ యాస్తిక భాటియాను(23) ప్రీతి బోస్ ఎల్బీగా వెనక్కి పంపింది. ఈ వికెట్ మినహా ఇంక ఆర్సీబీ ఖాతాలో మరో వికెట్ పడలేదు. మరో ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్, వన్డౌన్ బ్యాటర్ స్కైవర్ బ్రంట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వరుస పెట్టి బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచారు. ధాటిగా బ్యాటింగ్ చేస్తూ బౌలర్లకు చుక్కలు చూపించారు.

ముందు బౌలింగ్‌లో 3 వికెట్లతో అదరగొట్టిన హేలీ మ్యాథ్యూస్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. 38 బంతుల్లో 77 పరుగులు చేసి విధ్వంసం సృష్టించింది. ఇందులో 13 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. మ్యాచ్ అంతా వన్ వుమెన్ షోగా అదరగొట్టింది. మరోపక్క ఆమెకు నైట్ స్కైవర్ నుంచి చక్కటి సహకారం లభించింది. స్కైవర్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ సులభంగా అర్ధశతకం పూర్తి చేసుకుంది. 29 బంతుల్లో 55 పరుగులు చేసిన బ్రంట్ ఏ దశలోనూ ముంబయి బౌలర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి విజృంభణతో ముంబయి ఇండియన్స్ 14.2 ఓవర్లలోనే ఓ వికెట్ కోల్పోయి 159 పరుగులతో అద్భుత విజయాన్ని సాధించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓ మోస్తరు పరుగులే చేసింది. 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ రిచా ఘోష్(28), స్మృతి మంధాన(23) అత్యధిక పరుగులు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో ఒక్కరు 30కి పైగా పరుగులు చేయకపోవడంతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ముంబయి బౌలర్ల ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు కట్టారు. ముంబయి బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్ 3 వికెట్లతో రాణించగా.. సైకా ఇషికా, అమీలియా కెర్ చెరో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

Whats_app_banner