IPL 2023 Trading Start: ఆర్సీబీ నుంచి ముంబయి గూటికి చేరిన ఆస్ట్రేలియా పేసర్
IPL 2023 Trading Start: గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఆస్ట్రేలియా పేసర్ జేసన్ బెహ్రెండార్ఫ్ ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు. ఈ ఏడాది చివర్లో 2023 సీజన్ వేలం జరగనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ముగిసి మొన్నీమధ్యే అయినట్లుంది.. అప్పుడే 2023 సీజన్ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల క్రయవిక్రయాలు అప్పుడే మొదలయ్యాయి. ఆస్ట్రేలియా పేసర్ జేసన్ బెహ్రెండార్ఫ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ గూటికి చేరాడు. ఐపీఎల్ 2022 ఎడిషన్‌లో జేసన్ ఆర్సీబీ తరఫున ఆడాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మెగా వేలంలో అతడిని రూ.75 లక్షల బేసిక్ ధరకు బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ తన అధికారిక ట్విటర్ ద్వారా తెలియజేసింది.
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేసన్ బెహ్రెండార్ఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ముంబయి ఇండియన్స్‌కు మారాడు. టాటా ఐపీఎల్ 2023 సీజన్‌లో అతడు ముంబయి తరఫున ఆడనున్నాడు. 2022 ఎడిషన్‌లో జేసన్‌ను ఆర్సీబీ అతడి బేసిక్ ధర రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. అని ఐపీఎల్ తన ట్విటర్ ప్రకటనలో పేర్కొంది.
2021 ఎడిషన్‌ను చెన్నై తరఫున ఆడిన జేసన్‌ను ఈ సీజన్‌లో బెంగళూరు కొనుగోలు చేసింది. తాజాగా వచ్చే సీజన్ కోసం ముంబయి గూటికి చేరనున్నాడు. అంతకుముందు 2018 సీజన్‌లో ముంబయి తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఎడమ చేతి వాటం పేస్ బౌలర్ ఈ ఎడిషన్‌లో 9 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 21 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. 2018లో ముంబయి తరఫున ఆడినప్పుడు 5 మ్యాచ్‌ల్లో కనిపించి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ వేలం డిసెంబరు చివర్లో జరిగే అవకాశముంది. గత సీజన్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో అన్నింటికంటే దిగువన ఉండటమే కాకుండా.. ఆ జట్టుకు పీడకలలా మారింది. మరోపక్క ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఓటమిని చవిచూసింది.
సంబంధిత కథనం