Moto GP in India: భారత్‌ గ్రాండ్‌ ప్రి.. తొలిసారి ఇండియాకు వస్తున్న మోటో జీపీ-moto gp in india next year for the first time as bharat grand prix
Telugu News  /  Sports  /  Moto Gp In India Next Year For The First Time As Bharat Grand Prix
ఇక ఇండియాలోనూ మోటో జీపీ రేసులు
ఇక ఇండియాలోనూ మోటో జీపీ రేసులు (AP)

Moto GP in India: భారత్‌ గ్రాండ్‌ ప్రి.. తొలిసారి ఇండియాకు వస్తున్న మోటో జీపీ

21 September 2022, 17:52 ISTHari Prasad S
21 September 2022, 17:52 IST

Moto GP in India: భారత్‌ గ్రాండ్‌ ప్రి పేరుతో తొలిసారి ఇండియాకు వస్తోంది మోటో జీపీ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌. ఈ ఈవెంట్‌ ఎప్పుడు, ఎక్కడ జరగబోతోందో మీరూ చూసేయండి.

Moto GP in India: మోటో జీపీని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే దాని కోసం దేశం దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. తొలిసారి మోటో జీపీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ ఇండియాకు వస్తోంది. వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్‌ను మన దేశంలో జరగనుంది. దీనికోసం గ్రేటర్‌ నోయిడాలోని బుద్ధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ సిద్ధమవుతోంది.

ఇండియాలో భారత్‌ గ్రాండ్‌ ప్రి పేరుతో ఈ మోటో జీపీ అడుగుపెడుతోంది. ఈ మేరకు ఫెయిర్‌స్ట్రీట్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, డోర్నా స్పోర్ట్స్‌ మధ్య ఎంఓయూ కుదిరింది. మోటార్‌సైకిల్‌ రేసును ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని భారత ప్రేక్షకులకు అందించేందుకు డోర్నా స్పోర్ట్స్‌ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది.

అంతేకాదు ఇంటర్నేషనల్‌ లెవల్‌ మోటో జీపీ రైడర్లను ఇండియాలో తయారు చేసే దిశగా కృషి చేస్తోంది. మోటో జీపీనే కాదు.. మోటో ఈని కూడా ఇండియాకు పరిచయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మోటో జీపీని నోయిడాలో నిర్వహించనుండటంపై ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు.

"అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మక ఈవెంట్‌ అయిన మోటో జీపీని ఉత్తర ప్రదేశ్‌లో నిర్వహించనుండటం నిజంగా గర్వకారణం. ఈ ఈవెంట్‌ యూపీలో టూరిజం, ఆతిథ్య రంగాలకు బూస్ట్‌లా పని చేస్తుంది. ఈ ఈవెంట్‌ను గొప్ప సక్సెస్‌ చేయడానికి అవసరమైన పూర్తి మద్దతు అందిస్తుంది" అని యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. ఇక దేశంలో స్పోర్ట్స్‌, ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి ఇది చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలకు ఇది నిజమైన నివాళి అని ఆయన చెప్పారు. మోటో జీపీ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ను మరింత విస్తృతం చేయడంలో భాగంగా ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డె మోటోసైక్లిస్మ్‌ ఇండియాను ఎంచుకోవడం చాలా గర్వంగా ఉందని అనురాగ్‌ అన్నారు. ఇండియాలోనూ ఈ స్పోర్ట్‌కు చాలా పాపులారిటీ ఉందని ఆయన తెలిపారు.

ఇండియాలో తొలిసారి జరిగిన ఫార్ములా వన్‌ ఇండియన్ గ్రాండ్ ప్రికి కూడా నోయిడాలో ఉన్న ఈ బుద్ధ్‌ ఇంటర్నేషనల్ సర్క్యూటే ఆతిథ్యమిచ్చింది. అయితే ఒక సీజన్‌తోనే ఎఫ్‌1 ఇండియన్ గ్రాండ్‌ ప్రిని ముగించింది. ఇప్పుడు మోటో జీపీ రాక రేసింగ్ ప్రియులకు ఆనందాన్నిస్తోంది.