Michael Vaughan About Team India: వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫేవరెట్ అనడం సిల్లీ.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు-michael vaughan says utter nonsense to keep india favorites of 2023 odi world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Michael Vaughan About Team India: వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫేవరెట్ అనడం సిల్లీ.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

Michael Vaughan About Team India: వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫేవరెట్ అనడం సిల్లీ.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Nov 16, 2022 07:54 AM IST

Michael Vaughan About Team India: టీమిండియాపై ఇంగ్లాండా మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్ ఫేవరెట్ అనడం సిల్లీగా ఉందని స్పష్టం చేశారు.

భారత్-ఇంగ్లాండ్
భారత్-ఇంగ్లాండ్ (AFP)

Michael Vaughan About Team India: ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ విజయంతో ఇంగ్లాండ్ మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో జరిగిన పైనల్స్‌లో ఆ జట్టు అద్భుత విజయంతో రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. దీంతో పలువురు ఇంగ్లాండ్ మాజీలు, క్రికెట్ విశ్లేషకులు ఆ జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఎలాంటి సందేహం లేకుండా ఇంగ్లీష్ జట్టే విజయం సాధిస్తుందని జోస్యం పలుకుతున్నారు. ఈ విషయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఇంకో అడుగు ముందుకేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత గడ్డపై జరగనున్న ఈ టోర్నీలో టీమిండియా ఫేవరెట్ అనడం సిల్లీగా ఉందని, ఇంగ్లాండ్‌దే గెలుపని షాకింగ్ కామెంట్స్ చేశారు.

"భారత్‌లో వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో విజయమే ఇంగ్లాండ్ తదుపరి లక్ష్యం. ఇంగ్లీష్ జట్టుకు మంచి స్పిన్ ఆప్షన్లు ఉన్నాయి. వారిని టైటిల్ ఫేవరెట్లుగా సులభంగా చెప్పవచ్చు. స్వదేశంలో జరుగుతుంది కాబట్టి భారత్‌ను టైటిల్ ఫేవరెట్ అనడం సిల్లీగా అనిపిస్తుంది. ఇంగ్లాండ్ వారిని సులభంగా ఓడిస్తుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. రాబోయే కొన్నేళ్ల పాటు ఇదే జరుగుతుంది." అని మైఖేల్ వాన్ స్పష్టం చేశారు.

వైట్ బాల్ క్రికెట్ ఇంగ్లాండ్ జట్టు అసాధారణంగా ఆడుతుందని వాన్ తెలిపారు. "పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టు అసాధారణంగా ఉంది. ఇంగ్లీష్ క్రికెట్ ట్రెండ్ సెట్టింగ్ టీమ్‌ను కలిగి ఉంది. మిగిలిన ప్రపంచ వారిని అనుకరించాలి. ఇంగ్లాండ్ ఇంతలా మెరుగైన ప్రదర్శన చేయడానికి కారణమేంటని నన్ను అడిగితే.. ఆఫ్ ది గ్రౌండ్‌లో ప్రణాళికలు పక్కాగా ఉండాలి. ఒకవేళ భారత క్రికెట్‌కు నేను ఇంఛార్జ్‌గా ఉంటే నా అహంకారాన్ని చంపుకుని ప్రేరణ కోసం ఇంగ్లాండ్ జట్టును గమనిస్తాను. అని వాన్ అన్నారు.

ఇదిలా ఉంటే భారత్ స్వదేశంలో జరిగిన 2011 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఇంతవరకు ఏ వరల్డ్ కప్ కూడా గెలవలేదు. గత దశాబ్ద కాలంలో ధోనీ సారథ్యంలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గడం మినహా ఇంతవరకు ఏ ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. మరోపక్క ఇంగ్లాండ్ 2015లో వన్డే ప్రపంచకప్ అనంతరం.. తన జట్టు వ్యూహాలను పూర్తిగా మార్చివేసింది. ఫలితంగా 2019 వన్డే వరల్డ్ కప్‌తో పాటు ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ను కూడా కైవసం చేసుకుంది. గత ఐదు ఐసీసీ టోర్నీలను గమనిస్తే.. రెండు సార్లు విజేతగా నిలిచింది.

Whats_app_banner

సంబంధిత కథనం