Manu Bhaker: మూడో మెడల్‌పై కన్నేసిన మను బాకర్.. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ ఫైనల్‌కు..
Manu Bhaker: ఇప్పటికే రెండు ఒలింపిక్ మెడల్స్ తో చరిత్ర సృష్టించిన షూటర్ మను బాకర్ ఇప్పుడు మూడో మెడల్ పై కన్నేసింది. ఆమె 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ ఫైనల్ చేరడం విశేషం.
Manu Bhaker: ఇండియన్ షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్ లో దూసుకెళ్తోంది. ఇప్పటికే తాను పార్టిసిపేట్ చేసిన రెండు ఈవెంట్స్ లోనూ బ్రాంజ్ మెడల్స్ గెలిచిన ఆమె.. ఇప్పుడు మూడో ఈవెంట్లోనూ మెడల్ కు చేరువైంది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో మను ఫైనల్ చేరడం విశేషం. శుక్రవారం (ఆగస్ట్ 2) జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో రెండో స్థానంలో నిలిచి ఆమె ఫైనల్ చేరింది.
మూడో మెడల్‌పై కన్నేసిన మను
మను బాకర్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్లో 590 పాయింట్లు సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది. హంగరీకి చెందిన వెరోనికా మేజర్ 592 పాయింట్లతో టాప్ లో నిలిచింది. ఈ క్రమంలో ఆమె ఒలింపిక్ క్వాలిఫికేషన్ రికార్డును సమం చేసింది. ఇదే ఈవెంట్లో పాల్గొన్న మరో ఇండియన్ షూటర్ ఇషా సింగ్ ఏకంగా 18వ స్థానంతో ఇంటిదారి పట్టింది.
ఇప్పుడు 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లోనూ మను బాకర్ మెడల్ ఫేవరెట్ గా నిలిచింది. ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ గా చరిత్ర సృష్టించిన ఆమె.. ఇప్పుడు మూడో మెడల్ కూడా గెలిస్తే మాత్రం తిరుగులేని రికార్డు అవుతుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్ లో మనుకు మెడల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
25 మీటర్ల ఈవెంట్లో మను ఇలా..
నిజానికి ఈ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ప్రిసిషన్ రౌండ్లో మను కాస్త తడబడుతూ మొదలుపెట్టింది. తొలి సిరీస్ లో 5 షాట్లలో కేవలం రెండు మాత్రమే 10 స్కోరు చేసింది. అయితే తర్వాతి సిరీస్ లో మొత్తం ఐదు షాట్లు 10 స్కోర్లే కావడం విశేషం. అక్కడి నుంచి మను ఇక వెనుదిరిగి చూడలేదు. ర్యాపిడ్ లోనూ మను వరుసగా 100, 98, 98 స్కోర్లు చేసింది.
ప్రిసిషన్ రౌండ్ తర్వాత 294 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నా మను.. ర్యాపిడ్ రౌండ్ తర్వాత 590 పాయింట్లతో రెండో స్థానంలోకి వచ్చింది. రెండు పాయింట్లతో టాప్ స్థానాన్ని కోల్పోయింది. అయితే ఆమె ఫామ్ చూస్తుంటే ఫైనల్లో మెడల్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఫైనల్ శనివారం (ఆగస్ట్ 3) మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనుంది.
పారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకూ ఇండియా మూడు మెడల్స్ గెలవగా.. అన్నీ షూటింగ్ లోనే వచ్చాయి. అందులో మను బాకర్, సరబ్‌జ్యోత్ సింగ్, స్వప్నిల్ కుశాలెలు సాధించారు. ఇప్పుడు మను మరో మెడల్ సాధిస్తే నాలుగో మెడల్ కూడా షూటింగ్ నుంచే వచ్చినట్లవుతుంది. అయితే ఈసారి మెడల్ కచ్చితంగా తెస్తారనుకున్న బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ స్టార్లు సింధు, చిరాగ్, సాత్విక్ ఓడిపోవడం నిరాశ కలిగిస్తోంది.