KL Rahul | విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్
అత్యధిక వేగంగా టీ20 క్రికెట్‌లో 6 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు కేఎల్ రాహుల్. దీంతో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 179 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించాడు.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అదరగొడుతున్నాడు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన రాహుల్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్‌లో అత్యంత వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని అధిగమించిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇటీవల కాలంలో పొట్టి ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్న రాహుల్.. తాజాగా కోహ్లీని వెనక్కినెట్టి ఈ ఘనత సాధించాడు.
కేఎల్ రాహుల్ 179 ఇన్నింగ్స్‌ల్లో 138.18 స్ట్రైక్ రేటుతో 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు విరాట్ పేరిట ఉండేది. కోహ్లీ 6 వేల పరుగులను సాధించడానికి 184 ఇన్నింగ్స్‌లు ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 24 బంతుల్లో 30 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. ఈ రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా ఈ సీజన్‌లో జాస్ బట్లర్ తర్వాత శతకం సాధించిన ఆటగాడు రాహుల్ ఒక్కడే.
పొట్టి క్రికెట్ వేగంగా 6 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ ముందు వరుసలో ఉన్నాడు. గేల్ 162 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించాడు. అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 165 ఇన్నింగ్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజా రికార్డుతో రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు. భారత తరఫున కేఎల్ రాహుల్ తొలి స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్(213), సురేశ్ రైనా(217) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ 218 ఇన్నింగ్సులతో ఐదో స్థానంలో నిలిచాడు.
అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. 52 ఇన్నింగ్సుల్లో 141.49 స్ట్రైక్ రేటుతో 1831 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(3313), విరాట్ కోహ్లీ(3296) పరుగులతో ముందున్నారు.
మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 182 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 20 ఓవర్లలో 163 పరుగులకు మాత్రమే పరిమితమైంది. ఫలితంగా ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. హేజిల్‌వుడ్ 4 వికెట్ల లక్నో పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసకెళ్లింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లిసిస్ అదరగొట్టాడు. 64 బంతుల్లో 96 పరుగులు చేసిన అతడు.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇందులో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో దినేశ్ కార్తీక్ 8 బంతుల్లో 13 పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
సంబంధిత కథనం
టాపిక్