Karthik on Rahul: టాయిలెట్‌లోకి వెళ్లి ఏడ్చాను.. కేఎల్ రాహుల్‌ గురించి స్పందిస్తూ కార్తీక్ కామెంట్స్-karthik on rahul says quietly went to the toilet and shed a tear or two ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Karthik On Rahul: టాయిలెట్‌లోకి వెళ్లి ఏడ్చాను.. కేఎల్ రాహుల్‌ గురించి స్పందిస్తూ కార్తీక్ కామెంట్స్

Karthik on Rahul: టాయిలెట్‌లోకి వెళ్లి ఏడ్చాను.. కేఎల్ రాహుల్‌ గురించి స్పందిస్తూ కార్తీక్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Feb 21, 2023 02:24 PM IST

Karthik on Rahul: టాయిలెట్‌లోకి వెళ్లి ఏడ్చాను అంటూ కేఎల్ రాహుల్‌ గురించి స్పందిస్తూ దినేష్ కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కొంతకాలంగా దారుణమైన ఫామ్ లో ఉన్న రాహుల్ తన వైస్ కెప్టెన్సీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీమ్‌లోనూ చోటు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్
దినేష్ కార్తీక్, కేఎల్ రాహుల్

Karthik on Rahul: కేఎల్ రాహుల్.. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు వరకూ టీమ్ వైస్ కెప్టెన్. ఈ హోదాతోనే ఫామ్ లో లేకపోయినా తుది జట్టులో కొనసాగుతూ వస్తున్నాడు. కానీ ఆ మ్యాచ్ తర్వాత అతని వైస్ కెప్టెన్సీ పదవి ఊడింది. దీంతో మూడో టెస్ట్ టీమ్ లో రాహుల్ చోటు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. కొంత కాలంగా అతడు కెరీర్ లోనే చెత్త ఫామ్ లో ఉన్నాడు.

గత 10 టెస్టు ఇన్నింగ్స్ లో రాహుల్ స్కోర్లు చూస్తే 8, 12, 10, 22, 23, 10, 2, 20, 17, 1 గా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 1 పరుగుకే ఔటయ్యాడు. అయితే ఈ ఇన్నింగ్స్ లో అతన్ని దురదృష్టం వెంటాడింది. షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న హ్యాండ్స్‌కాంబ్ ప్యాడ్ కు తగిలి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీనిపై దినేష్ కార్తీక్ స్పందిస్తూ ఒకవేళ మూడో టెస్టులో రాహుల్ చోటు కోల్పోతే దానికి కారణం ఇదొక్క ఇన్నింగ్సే కాబోదని అన్నాడు.

అతనితో కలిసి చాలా క్రికెట్ ఆడిన కార్తీక్.. రాహుల్ దుస్థితిపై సానుభూతి వ్యక్తం చేశాడు. "రాహుల్ జట్టులో చోటు కోల్పోతే, ఇప్పుడు కోల్పోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దానికి కారణం ఇదొక్క ఇన్నింగ్స్ కాదు. గత ఐదారు టెస్టు మ్యాచ్ ల నుంచి ఏం జరుగుతోందో చూస్తేనే ఉన్నాం. అతడో క్లాస్ ప్లేయర్. అన్ని ఫార్మాట్లలోనూ మంచి ప్లేయర్. కానీ ప్రస్తుతం అతని టెక్నిక్ తో కాదు కానీ.. అతని బుర్రలో ఏం ఆలోచనలు వస్తున్నాయన్నదే కీలకం. ఆట నుంచి కొద్ది రోజులు దూరంగా ఉండాలి. వన్డేలకు ఫ్రెష్ గా రావాలి" అని కార్తీక్ అన్నాడు.

ప్రస్తుతం రాహుల్ లాగే తాను కూడా కెరీర్లో క్లిష్టమైన దశలను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. "ఇది ప్రొఫెషనల్ ప్రపంచం. ఇలాంటి బాధాకరమైన క్షణాలను అనుభవించాల్సిందే. బహుషా ఇదే తన చివరి ఇన్నింగ్స్ అని తెలిసిన సమయంలోనూ ఆ విధంగా ఔటవడం చూస్తుంటే బాధేసింది. నాకూ అలాగే జరిగింది. అలాంటప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లినప్పుడు సైలెంట్ గా టాయిలెట్ లోకి వెళ్లి కంటతడి పెట్టాను. ఇలాంటి పరిస్థితులలో మనం చేయగలిగేది ఏమీ లేదు" అని కార్తీక్ క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ చెప్పాడు.

ఇక ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ రావడం ఖాయమని కూడా కార్తీక్ స్పష్టం చేశాడు. రాహుల్ విషయంలో బాధగానే ఉన్నా.. అతడు రానున్న రోజుల్లో మరింత బలంగా పుంజుకొని వస్తాడన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.

సంబంధిత కథనం