Irfan Pathan on India Batsmen: తిక్కకూ ఓ లెక్కుండాలి.. టీమిండియా బ్యాటర్లపై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్
Irfan Pathan on India Batsmen: తిక్కకూ ఓ లెక్కుండాలి అంటూ టీమిండియా బ్యాటర్లపై ఇర్ఫాన్ పఠాన్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఇండియన్ టీమ్ రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోవడంపై ఇర్ఫాన్ ఈ కామెంట్స్ చేశాడు.
Irfan Pathan on India Batsmen: ఇండియన్ క్రికెట్ టీమ్ తొలి టీ20లో శ్రీలంకపై విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో టీమ్ చేసిన పొరపాట్లు మాత్రం చాలానే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో అక్షర్, దీపక్ హుడా చెలరేగకపోయి ఉంటే ఆ మ్యాచ్‌లో కచ్చితంగా ఇండియా ఓడిపోయేదే.
ఆ మ్యాచ్‌ను ఉద్దేశించి మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటర్ల వైఫల్యంపై స్పందిస్తూ.. తిక్కకూ ఓ లెక్కుండాలంటూ స్పందించాడు. "తిక్కకూ ఓ లెక్కుండాలి. రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోకూడదు అనేదే ఆ లెక్క. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడమే అసలు సమస్య" అని ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నాడు.
ఒకవేళ మొదట్లోనే రెండు, మూడు వికెట్లు పడిపోతే ఆ తర్వాత పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పడంపై దృష్టి సారించాలని చెప్పాడు. "నిజమే, దూకుడుగా ఆడాలి. కానీ రెండు, మూడు వికెట్లు త్వరగా పడినప్పుడు ఓ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పేలా చూడాలి. బ్యాటర్లు మెరుగవడానికి అవకాశం ఉంది. చెత్త షాట్లు ఆడుతూ వికెట్లు పారేసుకుంటే మాత్రం భారీ స్కోర్లు నమోదు కావు. దానిని దృష్టిలో పెట్టుకొని షాట్ల ఎంపిక ముఖ్యమని గమనించాలి" అని ఇర్ఫాన్ అన్నాడు.
తొలి టీ20 గెలిచిన టీమిండియా మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. గురువారం (జనవరి 5) పుణెలో జరిగే రెండో మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. ఈ మ్యాచ్‌తోపాటు సిరీస్‌కు కూడా సంజూ శాంసన్ దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో తుది జట్టులోకి రాహుల్ త్రిపాఠీ వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం