Irfan Pathan on Virat Kohli: కోహ్లీ స్పిన్నర్లపై దూకుడుగా ఆడాలి.. ఇర్ఫాన్ పఠాన్ సలహా
Irfan Pathan on Virat Kohli: విరాట్ కోహ్లీ స్పిన్నర్లపై దూకుడుగా ఆడాలని టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సలహా ఇచ్చాడు. స్పిన్ బౌలింగ్‌లో కోహ్లీ స్ట్రైక్ రేటు బాగా తగ్గిందని తెలిపాడు.
Irfan Pathan on Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు శతకాలు బాదిన కోహ్లీ.. అదే ఫామ్‌ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నెల 9 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ జరగనున్న నేపథ్యంలో మన రన్నింగ్ మెషిన్ పరుగుల వరద పారించాలని అభిమానులతో పాటు పలువురు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కూడా ఇదే విషయాన్ని తెలిపాడు. ఆసీస్ స్పిన్నర్ల బౌలింగ్‌లో దూకుడుగా ఆడాలని స్పష్టం చేశాడు.
"ఒక్క విషయం అతడు(కోహ్లీ) దృష్టిలో పెట్టుకోవాలి. ఆసీస్ స్పిన్నర్లు నాథన్ లయన్, అగర్ ఎలా ఎదుర్కోవాలో ముందే ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్పిన్నర్లతో ఆడేటప్పుడు అతడు కాస్త ఇబ్బంది పడుతున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో కాస్త దూకుడుగా ఆడటానికి ప్రయత్నించాలి. స్పిన్‌లో అతడి స్ట్రైక్ రేటు కూడా తగ్గింది." అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.
భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. వీరిలో అనుభవజ్ఞులైన నాథన్ లయన్, ఆష్తన్ అగర్ కూడా ఉన్నారు.
"ఇక్కడ మనం టెస్టు క్రికెట్ గురించే మాట్లాడుతున్నా. కానీ కొన్ని సార్లు స్పిన్ విషయంలో కొంచెం దూకుడుగా ఆడాలి. ముఖ్యంగా నాథన్ లయన్ ఎదుర్కొనేటప్పుడు అదనపు స్పిన్, బౌన్స్ వస్తుంది. అలాంటి సమయంలో దూకుడుగా ఆడితే అది మిమ్మల్ని మరింత మెరుగ్గా చేస్తుంది. రైట్ హ్యాండ్ బ్యాటర్‌కు దూరంగా బంతిని విసురుతాడు కాబట్టి కోహ్లీ ఈ విషయాన్ని తప్పకుండా గుర్చుకోవాలని నేను అనుకంటున్నాను" అని పఠాన్ సలహా ఇచ్చాడు.
ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేయగా.. టీ20 సిరీస్‌లో మాత్రం 2-1 తేడాతో గెలిచింది. అనంతరం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 9న నాగ్‌పుర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
సంబంధిత కథనం