Virat Kohli First Car: విరాట్ కోహ్లి తొలి కారు ఏదో తెలుసా.. డీజిల్ కారులో పెట్రోల్ పోయించి..-virat kohli first car is tata safari and he bought it with his own money ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli First Car: విరాట్ కోహ్లి తొలి కారు ఏదో తెలుసా.. డీజిల్ కారులో పెట్రోల్ పోయించి..

Virat Kohli First Car: విరాట్ కోహ్లి తొలి కారు ఏదో తెలుసా.. డీజిల్ కారులో పెట్రోల్ పోయించి..

Hari Prasad S HT Telugu
Apr 11, 2023 10:01 PM IST

Virat Kohli First Car: విరాట్ కోహ్లి తొలి కారు ఏదో తెలుసా? పైగా ఆ డీజిల్ కారులో పెట్రోల్ పోయించాడట. ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను ఐపీఎల్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అతడు చెప్పాడు.

స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి
స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి

Virat Kohli First Car: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి కార్లు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా? అతని దగ్గర ఇప్పటికే పోర్షె, ఆడి, బీఎండబ్ల్యూ, రేంజ్ రోవర్, బెంట్లీలాంటి ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిలో ఎన్నో కార్లను అమ్మేశానని కూడా ఈ మధ్యే అతడు చెప్పాడు. కానీ అతని తొలి కారు ఏదో తెలుసా? ఐపీఎల్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో కోహ్లి తన తొలి కారు గురించి చెప్పాడు.

విరాట్ తాను సంపాదించిన డబ్బులతోనే తన తొలి కారు కొన్నాడట. ఆ కారు పేరు సఫారీ. టాటా కంపెనీకి చెందిన ఈ కారు అప్పట్లో ఓ సంచలనం. ఆ కారుకు ఎంతో క్రేజ్ ఉండేది. రోడ్డుపై ఆ కారు వస్తుంటే.. మిగతావన్నీ పక్కకు తప్పుకునేవని, అది చూసే తాను ఆ కారు కొన్నట్లు కోహ్లి చెప్పాడు. అందులో తాను, తన అన్న తిరిగే వాళ్లమని అతడు తెలిపాడు.

అయితే ఈ సందర్భంగా జరిగిన ఓ సరదా ఘటనను కూడా విరాట్ వివరించాడు. కారులో మంచి మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నామని చెబుతూ.. తమ డీజిల్ కారులో పెట్రోల్ పోయించినట్లు కోహ్లి చెప్పాడు. పెట్రోల్ పంపులోకి వెళ్లి ట్యాంక్ ఫుల్ చేయమని చెప్పాం తప్ప అందులో డీజిల్ పోయాలని చెప్పలేదని, దీంతో ఆ వ్యక్తి పెట్రోల్ తో నింపేశాడని అన్నాడు.

ఆ తర్వాత తమ కారు తేడా కొట్టడంతో అసలు విషయం తెలిసిందని, దీంతో కారు ట్యాంక్ మొత్తం ఖాళీ చేయించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. సఫారీతో మొదలైన విరాట్ కార్ల ప్రస్థానం ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక మొత్తం సంపాదించే క్రికెటర్ గా కోహ్లికి ప్రతి లగ్జరీ కారునూ కొనేసే సామర్థ్యం ఉంది. అయితే అప్పట్లో స్పోర్ట్స్ కారు కొనాలని, ఏదో చేయాలని అనుకునేవాడినని, కానీ ఇప్పుడు మాత్రం ఫ్యామిలీ కారు ఉంటే చాలు అనిపిస్తోందని విరాట్ అనడం విశేషం.

WhatsApp channel

సంబంధిత కథనం