IPL 2023 Points Table: పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన లక్నో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో వచ్చిన మార్పులివే-lucknow sper giants rise to 2nd spot on ipl 2023 points table ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన లక్నో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో వచ్చిన మార్పులివే

IPL 2023 Points Table: పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన లక్నో.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో వచ్చిన మార్పులివే

Maragani Govardhan HT Telugu
Apr 29, 2023 10:43 AM IST

IPL 2023 Points Table: ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో లక్నో దూసుకెళ్లింది. పంజాబ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌ విజయం సాధించిన లక్నో రెండో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో లక్నో ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది.

పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి చేరిన లక్నో
పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి చేరిన లక్నో (AFP)

IPL 2023 Points Table: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 258 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేని పంజాబ్ 19.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్ హిస్టరీలోనే రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన లక్నో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కైల్ మేయర్స్, స్టాయినీస్ అర్ధశతకాలతో విజృంభించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో లక్నో దూసుకెళ్లింది.

ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్ల సాధించిన లక్నో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఫలితంగా గుజరాత్ టైటాన్స్ ఓ స్థానం దిగజారి మూడో ప్లేస్‌కు పరిమితమైంది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక అన్నింటింకంటే దిగువన దిల్లీ క్యాపిటల్స్ ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ జట్టు ముందు స్థానంలో ఉంది.

ఆరెంజ్ క్యాప్..

ఈ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన ఫాఫ్ డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. అతడు 8 మ్యాచ్‌ల్లో 422 పరుగులు చేశాడు. 333 పరుగులతో విరాట్ కోహ్లీ రెండో ప్లేస్‌లో ఉండగా.. చెన్నై బ్యాటర్లు డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ 3,4 స్థానల్లో కొనసాగుతున్నారు. కాన్వే 322 పరుగులు చేయగా. రుతురాజ్ గైక్వాడ్ 317 పరుగులు సాధించాడు.

పర్పుల్ క్యాప్..

అత్యధిక వికెట్ల తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా ఆర్సీబీ బౌలర్ మహమ్మద్ సిరాజ్(14 వికెట్లు) కొనసాగుతున్నాడు. ఫలితంగా పర్పుల్ క్యాప్ అతడి వద్దే ఉంది. గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్, పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, చెన్నై బౌలర్ తుషార్ దేశ్‌పాండే 14 వికెట్లతోనే ఆ తదుపరి స్థానాల్లో ఉన్నారు.

మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ఇలాంటి సమయంలో వన్డౌన్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన అథర్వ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో 66 పరుగులు సాధించి లక్నో బౌలర్లను భయపెట్టాడు. అయితే చివరకు విజయం లక్నోనే వరించింది. మొత్తంగా 19.1 ఓవర్లలో 201 పరుగులకు పంజాబ్ ను ఆలౌట్ చేసింది. లక్నో బౌలర్లలో యష్ ఠాకూర్ 4 వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్ 3 వికెట్లతో రాణించాడు. రవి భిష్ణోయ్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Whats_app_banner