Gavaskar on SRH Crowd: సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అనుచిత ప్రవర్తనపై గవాస్కర్ ఫైర్.. నిరాశ కలిగించిందని వ్యాఖ్యల
Gavaskar on SRH Crowd: ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అనుచిత ప్రవర్తన కారణంగా మ్యాచ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై భారత మాజీ సునీల్ గవాస్కర్‌తో పాటు కామేంటేటర్ సైమన్ డౌల్ స్పందించారు. వారి ప్రవర్తన నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించారు.
Gavaskar on SRH Crowd: శనివారం నాడు లక్నో సూపర్ జెయింట్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అవమానకర సంఘటన చోటు చేసుకుంది. ఉప్పల్‌లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో కొంతమంది ఆకతాయిలు చేసిన అనుచితంగా ప్రవర్తించడంతో మ్యాచ్‌కు 6 నిమిషాల అంతరాయం కలిగింది. ఫీల్డ్ అంపైర్ నోబాల్ నిర్ణయం తప్పుగా ఇచ్చారని ప్రేక్షకుల్లో కొంతమంది సీట్లకుండే నట్లు, బోల్టులను మైదానంలోకి విసిరేశారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ సునీల్ గవాస్కర్ సైతం ప్రేక్షకుల అనుచిత ప్రవర్తనపై మండిపడ్డారు. హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్‌పై విమర్శలు సంధించారు.
"ఇది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. చాలా వరకు మనం డగౌట్లను ఫ్లెక్సీ గ్లాస్ అని పిలుస్తాం. కానీ ఇక్కడ బీచ్‌లో ఉండే గొడుగులు లాంటి వస్తువులు ఉన్నాయి. సరైన రక్షణ, భద్రత లేదు. కమాన్ హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్ ఈ వస్తువుల కంటే సరైన డగౌట్‌లను మీరు అందించగలరు. ఇలాంటివి సమస్యలకు, ఇబ్బందులు కారణమవుతాయి." అని గవాస్కర్ స్పష్టం చేశారు.
ఉప్పల్ ప్రేక్షకుల ప్రవర్తనపై కామేంటేటర్‌గా వ్యవహరిస్తున్న సైమన్ డౌల్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి ప్రవర్తన తమ జట్టు కంటే ప్రదర్శన కంటే దిగజారిందని, వాళ్లు ఏం చేశారో సరిగ్గా తెలీదు కానీ.. చూస్తుంటే మాత్రం చాలా నిరాశగా అనిపిస్తుందని స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే..
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో ప్రేక్షకుల అనుచిత ప్రవర్తనతో మ్యాచ్‌కు 6 నిమిషాల అంతరాయం కలిగింది. లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రేరక్ మన్కడ్, తన తలకు ఏదో బలంగా తాకిందంటూ తమ డగౌట్‌కు సమాచారమిచ్చాడు. విషయం అంపైర్లకు చేరింది. వాళ్లు మ్యాచ్ ఆపించి.. మైదానంలో వెతకగా నట్లు, బోల్టులు దొరికాయి. గ్యాలరీలో కూర్చున్న కొంతమంది సీట్లకు ఉన్న నట్లు, బోల్టులను మైదానంలోకి విసిరేసినట్లు తేలింది. ఆవేష్ వేసిన ఆ ఓవర్లో ఫుల్ టాస్ బంతిని ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించగా.. లక్నో అప్పీల్ చేసుకుంది. బంతి నడుమ కంటే ఎత్తులో ఉన్నట్లు స్పష్టంగా కనిపించినా.. మూడో అంపైర్ వివాదాస్పద రీతిలో అంపైర్ నిర్ణయాన్ని తోసిపుచ్చారు. దీంతో అసంతృప్తి చెందిన కొంతమంది ప్రేక్షకులు నట్లు, బోల్టులు విసిరేశారు.
అంతేకాకుండా లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. ఆట ఆగినప్పుడు ఈ నినాదాలతో మరింత బిగ్గరగా అరిచారు. ఈ రకమైన ప్రవర్తన కారణంగా పలువురు వారిపై విమర్శలు సంధించారు. నిర్వహణపై హెచ్‌సీఏపై కూడా మండిపడ్డారు.
ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై లక్నో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్స్ ఆశలు నిలవలాంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు.. ప్రేరక్ మన్కడ్(64), నికోలస్ పూరన్(44), స్టోయినీస్(40) రాణించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి మ్యాచ్‌ను తన కంట్రోల్‌లో ఉంచుకున్న సన్‌రైజర్స్ చివరి ఐదు ఓవర్లలో మాత్రం చేతులెత్తేయడంతో లక్నో గెలిచింది. హైదరాబాద్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మయాంక్ మార్కండే తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.