Border-Gavaskar Trophy: స్టార్లు విఫలమైన చోట.. సత్తా చాటుతున్న ఆల్ రౌండర్లు.. దుమ్మురేపుతున్న జడ్డూ, అక్షర్ -indian star batters fail but all rounders axar patel and jadeja lift india batting ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Border-gavaskar Trophy: స్టార్లు విఫలమైన చోట.. సత్తా చాటుతున్న ఆల్ రౌండర్లు.. దుమ్మురేపుతున్న జడ్డూ, అక్షర్

Border-Gavaskar Trophy: స్టార్లు విఫలమైన చోట.. సత్తా చాటుతున్న ఆల్ రౌండర్లు.. దుమ్మురేపుతున్న జడ్డూ, అక్షర్

Maragani Govardhan HT Telugu
Feb 22, 2023 08:28 AM IST

Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత స్టార్ బ్యాటర్లు విఫమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. రెండు టెస్టుల్లోనూ వీరిద్దరూ తమ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించారు.

స్టార్ బ్యాటర్లు విఫలమైన వేళ రాణిస్తున్న ఆల్ రౌండర్లు
స్టార్ బ్యాటర్లు విఫలమైన వేళ రాణిస్తున్న ఆల్ రౌండర్లు (ANI)

Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు పర్యాటక ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అలాంటి జట్టు వ్యూహాలను తుత్తునీయలు చేస్తూ టీమిండియా అదరగొడుతోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో వరుసగా రెండింటిలో విజయాన్ని సాధించి 2-0తో సిరీస్ నిలబెట్టుకుంది. ఈ సిరీస్‌కు ముందు కనీసం ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడేందుకు ఆసక్తి చూపని కంగారూ జట్టు భారత్‌ను తక్కువ అంచనా వేసింది. ఆత్మవిశ్వాసమో, అతి విశ్వాసమో తెలియదు కానీ భారత స్పిన్నర్ల ధాటికి ఆసీస్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు. పలితంగా జరిగిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా విజయాన్ని సాధించింది.

మనోళ్లు కూడా సత్తా చాటలేదు..

ఇదిలా ఉంటే భారత బ్యాటర్లు ఏమైనా స్థాయికి తగినట్లు ఆడుతున్నారా? అంటే లేదనే చెప్పాలి. నాగ్‌పుర్ టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ మినహా స్టార్ బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. స్పిన్‌కు అనుకూలించే స్వదేశీ పిచ్‌ల్లోనే భారత ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్న వేళ విదేశాల్లో ఏమాత్రం సత్తా చాటుతారో చూడాలి. భారత బ్యాటింగ్‌లో పెద్ద లోపం టాపార్డర్ విఫలమవడం. రోహిత్ శర్మ శతకం చేసినప్పటికీ నిలకడగా అదే ప్రదర్శన కొనసాగించలేకపోతున్నాడు. ఇంక ఎన్నో ఆశలు పెట్టుకున్న అనుభవజ్ఞులైన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయనే లేదు. రెండు టెస్టుల్లో వీరిద్దరూ విఫలమయ్యారు.

ముఖ్యంగా కేఎల్ రాహుల్ ప్రదర్శనపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్లలో ఒక్క సెంచరీ కూడా అతడు నమోదు చేయలేదు. 46 టెస్టుల్లో అతడి సగటు వచ్చేసి 34 మాత్రమే. అతడు పదే పదే విఫలమవుతున్నప్పటికీ అవకాశాలు మాత్రం బాగానే ఇస్తున్నారు. ఇప్పటికే టీమ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ కేఎల్ రాహుల్‌ను వెనకేసుకొచ్చారు. రాహుల్‌కు అవకాశమివ్వడంలో తప్పేలేదని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే యువ ఆటగాళ్లయిన శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ మెరుగ్గా ప్రదర్శన చేస్తుండటం రాహుల్ స్థానంపై చర్చకు తావునిస్తోంది. సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. అయినప్పటీకీ సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులో తీసుకోకపోవడంతో చాలా మంది క్రీడా నిపుణులు సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఆదుకుంటున్న ఆల్ రౌండర్లు..

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో పుజారా ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో భారత్‌కు మిడిల్ ఆర్డర్ స్థిరత్వం అవసరాన్ని ఎత్తి చూపాయి. మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్‌లకు తొలి రెండు టెస్టుల్లో అవకాశమివ్వగా వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. దిల్లీ టెస్టులో శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకున్నప్పటికీ అతడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేదు. దీంతో భారమంతా స్పిన్ ఆల్ రౌండర్లయిన రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తీసుకుంటున్నారు. రెండు టెస్టుల్లో వీరిద్దరూ మెరుగైన ప్రదర్శన చేశారు. లోవర్ ఆర్డర్ బ్యాటర్ల వలే కాకుండా టాప్-6లో ఆడుతున్నారు కాబట్టి టీమిండియా లాంగ్ టాపార్డర్ బ్యాటర్లు వలే రాణిస్తున్నారంటూ వీరిపై క్రికెట్ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇదే విషయాన్ని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ కూడా తెలిపాడు. భారత స్పిన్ ఆల్ రౌండర్లు బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా రాణించి జట్టుకు విజయాన్ని అందిస్తున్నారని స్పష్టం చేశాడు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఈ సిరీస్‌లో జడేజా 96 పరుగులు చేయగా.. అశ్విన్ 60 పరుగులతో రాణించాడు. మరోపక్క అక్షర్ పటేల్ అందరికంటే ఎక్కువగా 158 పరుగులతో అదరగొట్టి బ్యాటింగ్‌లో ప్రధాన పాత్ర పోషించాడు.

అదరగొట్టిన అక్షర్..

నాగ్‌పుర్ టెస్టులో రోహిత్ శర్మకు తోడుగా రవీంద్ర జడేజా 70 పరుగులతో మెరుగైన ప్రదర్శన చేయగా.. దిల్లీ టెస్టులో అక్షర్ పటేల్ బ్యాట్‌తో అదరగొట్టాడు. భారత టాపార్డర్‌ను తన స్పిన్ మాయాజాలంతో నాథన్ లయన్ దెబ్బ కొట్టగా.. అక్షర్ ముందు మాత్రం అతడి పాచికలు పనిచేయలేదు. అతడి సులభంగా ఎదుర్కొని పరుగులు చేశాడు. సీనియర్ స్పిన్ బౌలర్ అశ్విన్‌తో కలిసి 9వ వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అక్షర్ షాట్ మేకింగ్ కూడా అద్భుతంగా ఉంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 262 పరుగులు చేసిందంటే అందులో అక్షర్ పాత్ర ఎంతైనా ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ 74 పరుగులు చేయగా.. అశ్విన్ 37 పరుగులతో రాణించాడు.

టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం అక్షర్ పటేల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రెండో టెస్టులో అశ్విన్‌తో అక్షర్ మ్యాచ్ మలుపు తిప్పాడని, వీరిద్దరి భాగస్వామ్యం కారణంగా స్కోరు 200-225కి వరకు చేరుకోగలిగిందని అన్నారు. లేకుంటే తొలి ఇన్నింగ్స్‌లోనే తాము వెనకబడి ఉండేవాళ్లమని స్పష్టం చేశారు.

Whats_app_banner