Football: ఫుట్‍బాల్ అభిమానులకు గుడ్‍న్యూస్.. ఆసియాకప్‍ కోసం భారత జట్లకు గ్రీన్‍ సిగ్నల్-indian football teams gets green signal to participate asian games officially ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Football: ఫుట్‍బాల్ అభిమానులకు గుడ్‍న్యూస్.. ఆసియాకప్‍ కోసం భారత జట్లకు గ్రీన్‍ సిగ్నల్

Football: ఫుట్‍బాల్ అభిమానులకు గుడ్‍న్యూస్.. ఆసియాకప్‍ కోసం భారత జట్లకు గ్రీన్‍ సిగ్నల్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 26, 2023 11:56 PM IST

Football - Asian Games: ఆసియా కప్ టోర్నీలో పాల్గొనేందుకు భారత ఫుట్‍బాల్ జట్లకు అనుమతి లభించింది. దీంతో ఆ స్పోర్ట్స్ టోర్నీలో ఇండియన్ టీమ్స్ బరిలోకి దిగనున్నాయి.

శాఫ్ చాంపియన్‍షిప్‍లో గెలిచినప్పుడు కెప్టెన్ సునీల్ ఛెత్రీ సహా భారత ఫుట్‍బాల్ ఆటగాళ్లు సంబరాలు
శాఫ్ చాంపియన్‍షిప్‍లో గెలిచినప్పుడు కెప్టెన్ సునీల్ ఛెత్రీ సహా భారత ఫుట్‍బాల్ ఆటగాళ్లు సంబరాలు (Twitter)

Football - Asian Games: ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత ఫుట్‍బాల్ పురుషుల, మహిళల జట్లకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆసియా ర్యాంకింగ్‍లను పరిగణనలోకి తీసుకొని నిబంధనల ఆసియా గేమ్స్‌లో ఆడేందుకు తొలుత ఫుట్‍బాల్ జట్లకు అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. అయితే, భారత ఫుల్‍బాల్ టీమ్స్ ఇటీవలి పర్ఫార్మెన్స్, ఫుల్‍బాల్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన అభ్యర్థనలతో క్రీడా మంత్రిత్వ శాఖ సడలింపు ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య చైనాలోని హాంగ్జౌలో జరగనున్న ఆసియా గేమ్స్ ఆడేందుకు భారత పురుషుల, మహిళల ఫుట్‍బాల్ జట్లకు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ట్వీట్ చేశారు. వివరాలివే..

“భారత ఫుట్‍బాల్ లవర్స్‌కు గుడ్‍న్యూస్. మన పురుషుల, మహిళల జాతీయ జట్లు రానున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొననున్నాయి. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఆసియా గేమ్స్‌లో తలపడేందుకు జట్లు అర్హత సాధించే పరిస్థితుల్లో లేకపోయినా.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. ఇటీవలి కాలంలో వారి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని ఈ మినహాయింపు ఇచ్చేందుకు మంత్రిత్వ శాఖ నిర్ణయించుకుంది. ఆసియా గేమ్స్‌లో వారు శాయశక్తులా కృషి చేసి దేశాన్ని గర్వించేలా చేస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నా” అని అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

క్రీడామంత్రిత్వ శాఖ నిబంధన ప్రకారం ఆసియాలో టాప్-8 ర్యాంకుల్లో ఉంటేనే జట్లను ఆసియా గేమ్స్‌కు పంపాలి. అందుకే 2018 జకర్తా ఆసియా క్రీడల్లోనూ భారత ఫుట్‍బాల్ జట్లు బరిలోకి దిగలేదు. అయితే, ప్రస్తుతం సునీల్ ఛెత్రి నేతృత్వంలోని భారత పురుషుల జట్టు ఆసియాలో 18వ ర్యాంకులో ఉంది (ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్‍ల్లో 99). అయితే, ఇటీవల టీమిండియా ఫుల్ ఫామ్‍లో ఉంది. ఈ ఏదాది ఇంటర్ కాంటినెంటల్ కప్, శాఫ్ చాంపియన్‍షిప్‍లో భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది. భారత మహిళల జట్టు కూడా ఇటీవల బాగా రాణిస్తోంది.

దీంతో ఈ ఏడాది ఆసియా క్రీడలకు క్రీడా మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్స్ నిబంధనలను భారత ఫుట్‍బాల్ జట్లకు సడలించింది. చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ మధ్య జరిగే ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత పురుషుల, మహిళల ఫుట్‍బాల్ జట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాగా, ఆసియా గేమ్స్ కోసం తమ జట్టుకు అనుమతి ఇవ్వాలని భారత పురుషుల ఫుట్‍బాల్ టీమ్ కెప్టెన్ ఇగోర్ స్టిమాక్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇటీవల కోరారు. నాలుగేళ్లుగా టీమిండియా అద్భుతంగా ఆడుతూ, గొప్ప ఫలితాలను రాబడుతోందని మోదీకి తెలిపారు. అవకాశం వస్తే మరింత ఎక్కువగా సాధిస్తామని, ఆసియా గేమ్స్‌లో జట్టు పాల్గొనే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

మొత్తంగా ఈ ఏడాది ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొనేందుకు ప్రభుత్వ ఓకే చెప్పటంతో ఫుట్‍బాల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్లేయర్లతో పాటు ఫ్యాన్స్ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Whats_app_banner