India vs Sri Lanka 1st T20: చెలరేగిన శివమ్ మావి.. లంకను చిత్తు చేసిన ఇండియా
India vs Sri Lanka 1st T20: ఇండియాకు ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లోనే శివమ్ మావి చెలరేగాడు. అతడు 4 వికెట్లు తీయడంతో ఉత్కంఠభరితంగా జరిగిన తొలి టీ20లో శ్రీలంకను చిత్తు చేసింది టీమిండియా.
India vs Sri Lanka 1st T20: శ్రీలంకతో నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన తొలి టీ20లో ఇండియా విజయం సాధించింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే శివమ్ మావి చెలరేగి 4 వికెట్లు తీయడంతో ఈ మ్యాచ్‌లో ఇండియా కేవలం 2 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. అటు ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్ కూడా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇండియా 1-0 లీడ్ సాధించింది.
కెప్టెన్ శనక (27 బాల్స్‌లో 41), చివర్లో చమిక కరుణరత్నె (16 బంతుల్లో 23) భయపెట్టినా.. ఇండియా గట్టెక్కింది. చివరి ఓవర్లో 13 రన్స్ అవసరం కాగా.. అక్షర్ పటేల్ వేసిన మూడో బంతికి సిక్స్ కొట్టాడు కరుణరత్నె. అయితే నాలుగో బంతికి పరుగు రాకపోవడం, ఐదో బంతికి సింగిల్, రజిత రనౌట్.. ఆరో బంతికి కరుణరత్నె రనౌట్ అవడంతో 2 పరుగులతో ఇండియా గెలిచింది.
163 రన్స్ చేజింగ్‌తో బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోయింది. 12 పరుగుల దగ్గర ఓపెనర్ నిస్సంక (1) ఔటయ్యాడు. తన తొలి ఓవర్లోనే శివమ్ మావి అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ధనంజయ డిసిల్వా (8), చరిత్ అసలంక (12), భనుక రాజపక్స (10) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. కాస్త నిలకడగా ఆడిన ఓపెనర్ కుశల్ మెండిస్ కూడా 28 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంతో శ్రీలంక 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో కెప్టెన్ శనక, హసరంగా కాసేపు ఇండియన్ బౌలర్లను భయపెట్టారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. హసరంగా 10 బాల్స్‌లోనే 21 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ క్రీజులో ఉన్నప్పుడు శ్రీలంకకు విజయాశకాశాలు మెరుగ్గా కనిపించాయి. తరచూ బౌండరీలు బాదుతూ ఇండియన్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. హసరంగ ఔటైన తర్వాత కూడా శనక దూకుడు కొనసాగించాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ కీలకమైన సమయంలో శనక (27 బాల్స్‌లో 41)ను ఔట్ చేయడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు.
చివర్లో చెలరేగిన దీపక్ హుడా, అక్షర్ పటేల్
అంతకుముందు టాప్, మిడిలార్డర్ విఫలమైనా టీమిండియా ఫైటింగ్ స్కోరు సాధించగలిగింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 29 బాల్స్‌లో 37 రన్స్ చేయడం.. చివర్లో దీపక్ హుడా (23 బాల్స్‌లో 41), అక్షర్ పటేల్ (20 బాల్స్‌లో 31) చెలరేగడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 రన్స్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియన్ టీమ్‌కు మొదట్లోనే షాక్ తగిలింది. కెరీర్‌లో తొలి టీ20 ఆడుతున్న శుభ్‌మన్ గిల్ 7 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ (7), సంజూ శాంసన్ (5) కూడా వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో 46 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో ఇషాన్ కిషన్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
అయితే ఈ సమయంలో మొదట ఇషాన్ కిషన్ (29 బాల్స్‌లో 37), హార్దిక్ (27 బాల్స్‌లో 29) కూడా ఔటయ్యారు. దీంతో 94 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయి ఇండియన్ టీమ్ కష్టాల్లో పడింది. ఈ దశలో దీపక్ హుడా, అక్షర్ పటేల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో లంక బౌలర్లపై ఎదురు దాడికి దిగడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.