India vs Bangladesh 1st test day 1: పుజారా సెంచరీ మిస్‌.. శ్రేయస్‌ హాఫ్‌ సెంచరీ.. తొలి రోజు స్కోరు ఇదీ-india vs bangladesh 1st test day 1 pujara and shreyas iyer century partnership takes india past 250 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Bangladesh 1st Test Day 1: పుజారా సెంచరీ మిస్‌.. శ్రేయస్‌ హాఫ్‌ సెంచరీ.. తొలి రోజు స్కోరు ఇదీ

India vs Bangladesh 1st test day 1: పుజారా సెంచరీ మిస్‌.. శ్రేయస్‌ హాఫ్‌ సెంచరీ.. తొలి రోజు స్కోరు ఇదీ

Hari Prasad S HT Telugu
Dec 14, 2022 04:23 PM IST

India vs Bangladesh 1st test day 1: పుజారా సెంచరీ మిస్‌ కాగా.. శ్రేయస్‌ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. దీంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి రోజు టీమిండియా ఓ మోస్తరు స్కోరు చేసింది.

సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకున్న శ్రేయస్ అయ్యర్, పుజారా
సెంచరీ భాగస్వామ్యంతో ఆదుకున్న శ్రేయస్ అయ్యర్, పుజారా (AP)

India vs Bangladesh 1st test day 1: టాపార్డర్‌తోపాటు స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లి విఫలమైనా.. బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ తొలి రోజు టీమిండియాను ఆదుకున్నారు చెతేశ్వర్‌ పుజారా, శ్రేయస్‌ అయ్యర్‌. ఒక దశలో 48 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయినా.. వీళ్లిద్దరి సెంచరీ పార్ట్‌నర్‌షిప్‌తో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 278 రన్స్‌ చేసింది. తొలి రోజు చివరి బంతికి అక్షర్ పటేల్ (13)ను ఔట్ చేసి బంగ్లాదేశ్ పైచేయి సాధించింది.

బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ కీలకమైన మూడు వికెట్లు తీసుకున్నాడు. అతడు ఓపెనర్ గిల్ తో పాటు విరాట్ కోహ్లి, పుజారా వికెట్లు తీశాడు. మరో స్పిన్నర్ మెహదీ హసన్ 2 వికెట్లు తీసుకున్నాడు. తొలి రోజే అంతగా బౌన్స్ లేని ఈ పిచ్ పై ఒకరకంగా ఇండియా సాధించిన స్కోరు మంచిదే అని చెప్పాలి. రెండో రోజు ఈ స్కోరును 300 దాటిస్తే ఫైట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ టీమ్ లో ముగ్గురు స్పిన్నర్లు ఉండటం కూడా కలిసి వచ్చేదే.

పుజారా 90 రన్స్‌ చేసి ఔటవగా.. శ్రేయస్‌ అయ్యర్‌ 82 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 149 రన్స్‌ జోడించారు. పుజారా 203 బాల్స్‌లో 11 ఫోర్లతో 90 రన్స్‌ చేశాడు. రిషబ్‌ పంత్‌ 45 బాల్స్‌లోనే 46 రన్స్‌తో ఓ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. శ్రేయస్‌ అయ్యర్‌ 169 బాల్స్‌లో 82 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్, శుభ్‌మన్‌ గిల్‌ మంచి స్టార్ట్ అందించినా.. దానిని భారీ స్కోరుగా మలచలేకపోయారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 41 రన్స్‌ జోడించారు. ఈ దశలో శుభ్‌మన్‌ గిల్‌ 20 రన్స్‌ చేసి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే కేఎల్‌ రాహుల్‌ (22) కూడా ఔటవగా.. తర్వాత వచ్చిన విరాట్‌ కోహ్లి కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు.

దీంతో టీమిండియా 48 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్ బంగ్లా బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. దీంతో స్కోరు వేగం పెరిగింది. తనదైన స్టైల్లో చెలరేగి ఆడిన పంత్‌.. 45 బాల్స్‌లో 46 రన్స్‌ చేశాడు. స్కోరు 112 రన్స్‌ దగ్గర అతడు మెహదీ హసన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఈ దశలో టీమ్‌ కష్టాల్లో పడినట్లు కనిపించినా.. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న పుజారా, శ్రేయస్‌ అయ్యర్‌ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ వికెట్లకు అడ్డుకట్ట వేయకపోయి ఉంటే.. తొలి రోజే ఈ మ్యాచ్ టీమిండియా చేతుల్లో నుంచి చేజారిపోయేదే.

Whats_app_banner