Virat Kohli Opening: ఎనిమిదేళ్ల తర్వాత విరాట్‌ కోహ్లి ఓపెనింగ్‌.. దారుణంగా విఫలమైన మాజీ కెప్టెన్‌-virat kohli opening after 2014 in odis but failed miserably ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Opening: ఎనిమిదేళ్ల తర్వాత విరాట్‌ కోహ్లి ఓపెనింగ్‌.. దారుణంగా విఫలమైన మాజీ కెప్టెన్‌

Virat Kohli Opening: ఎనిమిదేళ్ల తర్వాత విరాట్‌ కోహ్లి ఓపెనింగ్‌.. దారుణంగా విఫలమైన మాజీ కెప్టెన్‌

Hari Prasad S HT Telugu
Dec 07, 2022 07:17 PM IST

Virat Kohli Opening: ఎనిమిదేళ్ల తర్వాత విరాట్‌ కోహ్లి వన్డేల్లో ఓపెనింగ్‌ చేశాడు. కానీ మరోసారి దారుణంగా విఫలమై తీవ్రంగా నిరాశ పరిచాడు టీమిండియా మాజీ కెప్టెన్‌.

ఓపెనర్ గా వచ్చి విఫలమైన విరాట్ కోహ్లి
ఓపెనర్ గా వచ్చి విఫలమైన విరాట్ కోహ్లి (ANI )

Virat Kohli Opening: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఓపెనింగ్‌కు దిగాడు. కెప్టెన్‌ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడటంతో అతని స్థానంలో విరాట్‌ ఓపెనింగ్‌ చేశాడు. అయితే కేవలం 5 పరుగులు చేసి ఎబాదత్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

రోహిత్‌ గాయపడటంతో రాహుల్ ఓపెనింగ్‌కు వస్తాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం విరాట్‌ను పంపించింది. రాహుల్‌ తొలి వన్డేలో ఐదోస్థానంలో వచ్చి సక్సెస్‌ అయ్యాడు. దీంతో మరోసారి అదే జరుగుతుందని అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో రాహుల్‌ కూడా విఫలమయ్యాడు. అతడు 28 బాల్స్‌లో 14 రన్స్‌ మాత్రమే చేశాడు.

విరాట్‌ కోహ్లి వన్డేల్లో 8 ఏళ్ల తర్వాత ఓపెనర్‌గా రావడం విశేషం. చివరిసారి 2014, జనవరి 28న న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో విరాట్‌ ఓపెనింగ్‌ చేశాడు. అప్పుడు కూడా కేవలం 3 రన్స్‌ మాత్రమే చేసి ఔటయ్యాడు. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేకు ముందు ఆరుసార్లు వన్డేల్లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. నిజానికి వన్డేల్లో అతని అరంగేట్రమే ఓపెనర్‌గా జరిగింది.

అయితే బంగ్లాదేశ్‌తో భారీ టార్గెట్‌ చేజింగ్‌లోనూ విరాట్‌ విఫలమవడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. తొలి వన్డేలోనూ 9 పరుగులే చేశాడతడు. దీంతో వన్డేల నుంచి కోహ్లి, రోహిత్‌లను తప్పించాలని, వాళ్లు రిటైర్‌ కావాలని ట్విటర్‌లో అభిమానులు డిమాండ్‌ చేయడం గమనార్హం. అంతకుముందు రెండో వన్డేలో బౌలర్లు కూడా చివర్లో చేతులెత్తేశారు.

ఒక దశలో బంగ్లాదేశ్‌ 69 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోవడంతో కనీసం 100 రన్స్‌ అయినా చేస్తుందా అని అనుకున్నారు. కానీ మెహదీ హసన్‌ సెంచరీతో ఆ టీమ్‌ను 271 రన్స్‌ స్కోరుకు తీసుకెళ్లాడు. మహ్మదుల్లా కూడా 77 రన్స్‌ చేశాడు.

WhatsApp channel