Kohli Fitness | విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ మీకు తెలుసా?-how virat kohli transformed himself as one of the fittest cricketer in the world ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Fitness | విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ మీకు తెలుసా?

Kohli Fitness | విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ మీకు తెలుసా?

Hari Prasad S HT Telugu
Jan 24, 2022 05:30 PM IST

Kohli Fitness.. ఇప్పుడతని వయసు 33 ఏళ్లు. అయినా టీమ్‌లోని ఏ యువ క్రికెటర్‌ కూడా ఫిట్‌నెస్‌లో అతని దరిదాపుల్లోకి కూడా రారు. మరి అతను ఇంతలా మారిపోవడానికి కారణమేంటి? అతని డైట్‌, వర్కౌట్‌ రొటీన్ ఎలా ఉంటుంది? క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకునే వారు, కనీసం ఫిట్‌గా ఉంటే చాలు అనుకునే వారు తప్పక చదవండి.

<p>ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి</p>
ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి (AFP)

విరాట్‌ కోహ్లి.. క్రికెట్‌లోనే కాదు ప్రపంచంలోని ఫిటెస్ట్‌ అథ్లెట్లలో ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇదే విరాట్‌ కోహ్లి ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లోకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేవాడో మీకు గుర్తుండే ఉంటుంది. బొద్దుగా ఉంటూ, ఏది పడితే అది తింటూ అసలు ఫిట్‌నెస్‌ అంటే ఏంటో తెలియనట్లుగా ఉండేవాడు. ఇప్పటి విరాట్‌ను చూస్తే ఓ మనిషి ఇంతలా మారిపోగలడా అని అనిపించక మానదు.

ఇప్పుడతని వయసు 33 ఏళ్లు. అయినా టీమ్‌లోని ఏ యువ క్రికెటర్‌ కూడా ఫిట్‌నెస్‌లో అతని దరిదాపుల్లోకి కూడా రారు. మరి అతను ఇంతలా మారిపోవడానికి కారణమేంటి? అతని డైట్‌, వర్కౌట్‌ రొటీన్ ఎలా ఉంటుంది? క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకునే వారికి, కనీసం ఫిట్‌గా ఉంటే చాలు అనుకునే వారికి అతడు ఇచ్చే టిప్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి.

విరాట్‌ కోహ్లి.. ఇంత మార్పు ఎలా?

2011లో తొలిసారి టీమిండియా వరల్డ్‌కప్‌ టీమ్‌లో ఆడాడు విరాట్‌ కోహ్లి. కానీ అప్పటికీ అతని ఆటలోగానీ, ఫిట్‌నెస్‌లోగానీ ఆ సీరియస్‌నెస్‌ లేదు. ఆ వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాతే కోహ్లి తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాడు. తన శరీర ఆకృతి క్రికెట్‌ ఆడటానికి ఏమాత్రం అనుకూలంగా లేదని గుర్తించిన విరాట్‌.. అప్పటి నుంచి తన లైఫ్‌స్టైల్‌ను మార్చేశాడు. తనకెంతో ఇష్టమైన నాన్‌వెజ్‌ను పక్కన పెట్టేశాడు. బటర్‌ చికెన్‌ అంటే పడి చచ్చే కోహ్లి.. ఆ రోజు నుంచీ దాని వైపు చూడలేదు. పూర్తి శాకాహారిగా మారిపోయాడు. జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేయడం ప్రారంభించాడు.

విరాట్‌ కోహ్లి డైట్‌ ఏంటి?

ఓ స్పోర్ట్స్‌మన్‌ అనే కాదు ఓ సగటు మనిషి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఫిట్‌గా ఉండాలంటే ముందుగా చేయాల్సింది సమతుల ఆహారం తీసుకోవడం. ఏది పడితే అది తినకుండా నోటికి తాళం వేసుకుంటేనే శారీరకంగా ఫిట్‌గా ఉండగలుగుతాం. విరాట్‌ చేసింది కూడా అదే. తన డైట్‌ను అతడు కచ్చితంగా ఫాలో అవుతాడు. ప్రొటీన్‌ అంటే కేవలం నాన్‌వెజ్‌తోనే దొరుకుతుందన్న అపోహలను అతడు పటాపంచలు చేశాడు. ఒకప్పుడు విరాట్‌ రోజువారీ ఆహారంలో 90 శాతం మాంసమే ఉండేది. డెయిరీ ఉత్పత్తులను కూడా విపరీతంగా తీసుకునేవాడు. కానీ ఇప్పుడతడు వాటికి పూర్తిగా దూరం. 

అప్పట్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తన రోజువారీ డైట్‌ గురించి కోహ్లియే వివరించాడు. ఎక్కువ మొత్తంలో కూరగాయలు, పాలకూర, కొన్ని గుడ్లు, రెండు కప్పుల కాఫీ, పప్పు, క్వినోవా, పండ్లు, బాదాం, ప్రొటీన్‌ బార్‌.. ఇవీ విరాట్‌ రోజువారీ డైట్‌లో కచ్చితంగా ఉంటాయి. తనకు దోసెలన్నా కూడా చాలా ఇష్టమని కోహ్లి చాలాసార్లు చెప్పాడు. ఇప్పటికీ విరాట్‌ ఎక్కడికి వెళ్లినా తన ఆహారాన్ని తానే వెంట తీసుకెళ్తాడు. ఫిట్‌నెస్‌పై తనకున్న నిబద్ధతకు నిదర్శనమిది.

విరాట్‌ కోహ్లి వర్కౌట్స్‌

ఇక కోహ్లి వర్కౌట్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు ఓ ఫిట్‌నెస్‌ బుక్‌గా పనికొస్తాయి. వారంలో ఆరు రోజులు వర్కౌట్స్‌ చేసే విరాట్‌.. ఒక రోజు శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తాడు. జిమ్‌లో ఎక్కువగా బరువులు ఎత్తడం, స్క్వాట్స్‌, కార్డియో ఎక్సర్‌సైజులు చేయడానికి ప్రాధాన్యమిస్తాడు. అతడు చేసే ప్రతి కసరత్తు కండరాలను బలంగా మార్చేలా చేస్తాయి. ఈ ఫిట్‌నెస్‌ లెవల్సే వికెట్ల మధ్య మెరుపు వేగంతో పరుగెత్తడానికి, ఫీల్డ్‌లో చురుగ్గా ఉండటానికి కోహ్లికి పనికొస్తాయి. మిగతా క్రికెటర్లతో పోలిస్తే కోహ్లి గాయపడిన సందర్భాలు కూడా చాలా తక్కువ.

Whats_app_banner

సంబంధిత కథనం