Hockey World Cup IND vs NZ: హాకీ వరల్డ్‌కప్‌లో ముగిసిన ఇండియా పోరాటం - న్యూజిలాండ్ చేతిలో ఓటమి
Hockey World Cup IND vs NZ: హాకీ వరల్డ్ కప్‌లో పూల్ దశలోనే ఇండియా పోరాటం ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఇండియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.
Hockey World Cup IND vs NZ: హాకీ వరల్డ్ కప్‌లో ఇండియా పోరాటం ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ 3-3 గోల్స్‌తో టై కావడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఈ పెనాల్టీ షూటౌట్‌లో న్యూజిలాండ్ ఐదు గోల్స్ చేయగా ఇండియా నాలుగు గోల్స్ మాత్రమే చేసింది.
ఈ గెలుపుతో న్యూజిలాండ్ క్వార్టర్ ఫైనల్ చేరుకోగా ఇండియా టీమ్ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్‌పై ఇండియా టీమ్ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. 18వ నిమిషంలో లలిత్ కుమార్ గోల్‌తో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 22వ నిమిషంలో నిలకాంత్ శర్మ గోల్ చేసినా గోల్ పోస్ట్ లోకి వెళ్లడానికి ముందు బాల్ బేస్ లైన్ దాటడంతో ఫౌల్‌గా అంపైర్ ప్రకటించాడు.
ఆ తర్వాత 25వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను సుఖ్‌జీత్ గోల్‌గా మలచడంతో ఇండియా 2-0తో లీడ్‌లో నిలిచింది. సెకండ్ క్వార్టర్ ముగుస్తుందనగా న్యూజిలాండ్ తొలి గోల్ చేసింది. ఆ తర్వాత 42వ నిమిషంలో వరుణ్ గోల్‌తో ఇండియా ఆధిక్యం 3-1కి చేరుకుంది.
ఈ మ్యాచ్ ఇండియా గెలుపు ఖాయం అనుకుంటున్న తరుణంలో చివరలో విజృంభించిన న్యూజిలాండ్ ప్లేయర్లు వరుసగా రెండు గోల్స్ చేయడంతో స్కోరు 3-3తో సమమైంది. పెనాల్టీ షూటౌట్‌లో 4-5తో ఇండియాపై న్యూజిలాండ్ విజయాన్ని సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది.