Hockey World Cup 2023: హాకీ వరల్డ్‌కప్ షురూ.. వరుసగా రెండోసారీ ఒడిశాలోనే..
Hockey World Cup 2023: హాకీ వరల్డ్‌కప్ షురూ అయింది. వరుసగా రెండోసారీ ఒడిశాలోనే ఈ మెగా టోర్నీ జరుగుతోంది. బుధవారం (జనవరి 11) కళ్లు చెదిరే ఓపెనింగ్ సెర్మనీతో హాకీ వరల్డ్ కప్ ప్రారంభమైంది.
Hockey World Cup 2023: మెన్స్ హాకీ వరల్డ్‌కప్ 2023 బుధవారం (జనవరి 11) ప్రారంభమైంది. కటక్‌లోని బారాబతి స్టేడియంలో వేలాది మంది హాకీ అభిమానుల కేరింతల మధ్య ఈ మెగా టోర్నీ ఓపెనింగ్ సెర్మనీ జరిగింది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తయ్యబ్ ఇక్రమ్, హాకీ ఇండియా ఛైర్మన్ దిలీప్ టిర్కీ ఈ సెర్మనీలో పాల్గొన్నారు.
ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న 16 టీమ్స్‌కు వీళ్లు స్వాగతం పలికారు. 2018లోనూ హాకీ వరల్డ్‌కప్ నిర్వహించిన ఒడిశానే.. ఇప్పుడు కూడా మరోసారి టోర్నీ నిర్వహిస్తోంది. దీంతో ఒడిశాను ల్యాండ్ ఆఫ్ హాకీగా అభివర్ణించారు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తయ్యబ్ ఇక్రమ్. టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తున్న ఒడిశా ప్రభుత్వానికి క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి స్పోర్టింగ్ ఈవెంట్స్ నిర్వహించే రాష్ట్రాలకు ఎప్పుడూ మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. ఇక హాకీ వరల్డ్‌కప్‌ను వరుసగా రెండుసార్లు నిర్వహించేందుకు మద్దతిచ్చిన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కృతజ్ఞతలు చెప్పారు. బారాబతి స్టేడియంలో ఏకంగా నాలుగు గంటల పాటు ఓపెనింగ్ సెర్మనీ జరిగింది.
ఒడిశా రాష్ట్ర ఆదివాసీ నృత్యంతో ఈ సెర్మనీ ప్రారంభమైంది. ఒక ఒడిశా సింగర్స్ స్నితి మిశ్రా, రితురాజ్ మొహంతి, లీసా మిశ్రాలు కూడా పర్ఫార్మ్ చేశారు. వేల మంది హాకీ అభిమానులు ఈ సెర్మనీ చూడటానికి వచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఈ హాకీ వరల్డ్‌కప్ థీమ్ సాంగ్ కంపోజ్ చేశారు. ఈ పాటను కూడా ఓపెనింగ్ సెర్మనీ సందర్భంగా పలువురు సింగర్స్ పాడారు.
హాకీ వరల్డ్‌కప్‌లో భాగంగా జనవరి 13 నుంచి 29 వరకూ రెండు వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. రూర్కెలాలో కొత్తగా నిర్మించిన బిర్సా ముండా స్టేడియంతోపాటు భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. రూర్కెలాలో 20 మ్యాచ్‌లు, భువనేశ్వర్‌లో 24 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ వరల్డ్‌కప్ కోసమే రూర్కెలాలో రికార్డు సమయంలోనే ఒడిశా ప్రభుత్వం కొత్త స్టేడియం నిర్మించింది.
సంబంధిత కథనం