Rourkela Hockey Stadium: దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం రెడీ.. వరల్డ్‌కప్‌ కోసం ముస్తాబు-rourkela hockey stadium indias biggest is now ready for world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rourkela Hockey Stadium Indias Biggest Is Now Ready For World Cup

Rourkela Hockey Stadium: దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం రెడీ.. వరల్డ్‌కప్‌ కోసం ముస్తాబు

Hari Prasad S HT Telugu
Dec 26, 2022 01:55 PM IST

Rourkela Hockey Stadium: దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం సిద్ధమైంది. రూర్కెలాలో నిర్మించిన ఈ వరల్డ్‌ క్లాస్‌ స్టేడియం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్‌ కోసం ముస్తాబైంది.

రూర్కెలా స్టేడియం
రూర్కెలా స్టేడియం

Rourkela Hockey Stadium: హాకీ వరల్డ్‌కప్‌ కోసం ఒడిశా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కొత్తగా ఓ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించారు. ఇది దేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం కావడం విశేషం. ఈ స్టేడియంలో మొత్తం 20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. దీనికి ఆదివాసీ యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా పేరు పెట్టనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ స్టేడియానికి గతేడాది ఫిబ్రవరి 16న ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో ఎవరూ ఈ స్టేడియం నిర్మాణం గడువు(నవంబర్‌ 30)లోపు పూర్తవుతుందని ఊహించలేదు. కానీ 1200 మంది కూలీలు అప్పటి నుంచి రాత్రి పగలు అన్న తేడా లేకుండా దీని నిర్మాణంపై పని చేశారు. మొత్తానికి అనుకున్న సమయానికే దీని నిర్మాణం పూర్తయింది.

హాకీ వరల్డ్‌కప్‌ రెండు స్టేడియాల్లో జరగనుండగా అందులో ఒకటి కొత్తగా నిర్మితమైన ఈ రూర్కెలా స్టేడియం. మరొకటి భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం. ఈ కొత్త స్టేడియంలో 20 మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి 13 నుంచి జనవరి 29 వరకూ ఇండియాలో హాకీ వరల్డ్‌కప్‌ జరగనున్న విషయం తెలిసిందే.

రూర్కెలా స్టేడియం విశేషాలివీ..

రూర్కెలా స్టేడియంలో ఇండియాలోనే అతిపెద్ద హాకీ స్టేడియం. 16 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టేడియంలో 21 వేల మంది కూర్చొని మ్యాచ్‌ను చూసే వీలుంది. గతేడాది ఆగస్ట్‌లో అసలు నిర్మాణం ప్రారంభం కాగా.. 15 నెలల్లోనే మొత్తం పూర్తి కావడం విశేషం. ఈ స్టేడియం నిర్మాణం కోసం మొత్తం 3600 టన్నుల సాధారణ స్టీలు, 4 వేల టన్నుల టీఎంటీ స్టీల్‌ను వినియోగించారు.

ప్రపంచంలోని మరే స్టేడియంలో లేని విధంగా ఇక్కడి సీట్లు ఫీల్డ్‌కు దగ్గరగా ఉన్నాయి. ఈ స్టేడియం నిర్మాణానికి మొత్తం రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు ఒడిశా క్రీడామంత్రి తుషార్‌కంటి బెహరా వెల్లడించారు. ఇక మరో రూ.375 కోట్లతో భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియాన్ని ఆధునీకరించారు. ఈ కొత్త స్టేడియానికి సమీపంలోనే ప్లేయర్స్‌ కోసం వసతి, జిమ్‌, స్విమ్మింగ్‌పూల్‌, ప్రాక్టీస్‌ ఫీల్డ్‌ ఏర్పాటు చేశారు.

ఇక రూర్కెలా నగరంలో ఈ మెగా టోర్నీ కోసమే ప్రత్యేకంగా 225 4-స్టార్‌ గదులను ఒడిశా ప్రభుత్వం నిర్మించింది. ఇందులో ప్లేయర్స్‌, ఇతర అధికారులు ఉండటానికి ఏర్పాట్లు చేశారు. ఇక మ్యాచ్‌లు చూడటానికి సిటీకి వచ్చే ప్రేక్షకుల కోసం రూర్కెలాలో చిన్నవి, పెద్దవి కలిపి 60 హోటళ్లలో 1500 రూమ్స్‌ ఉన్నాయి.

WhatsApp channel

టాపిక్