Ravi Shastri: “ప్రపంచకప్ తర్వాత అతడు భారత కెప్టెన్ అవ్వాలి”: మాజీ హెడ్‍కోచ్ రవిశాస్త్రి
Ravi Shastri: వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ హెడ్‍కోచ్ రవిశాస్త్రి. సంజూ శాంసన్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
Ravi Shastri: టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు అనే విషయం ప్రస్తుతం హాట్‍టాపిక్‍గా ఉంది. ప్రస్తుతం టెస్టులు, వన్డేలు, టీ20లు.. మూడు ఫార్మాట్‍లకు రోహిత్ శర్మ.. టీమిండియా కెప్టెన్‍గా ఉన్నాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డేలు, టీ20)కు యువ కెప్టెన్ ఉండాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్‍కోచ్ రవిశాస్త్రి కీలక కామెంట్స్ చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‍కు కెప్టెన్‍గా ఎవరు ఉండాలో తన అభిప్రాయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్‍గా హార్దిక్ పాండ్యా ఉండాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్ ఆడే పరిస్థితుల్లో పాండ్య లేనట్టుగా కనిపిస్తోందని, అందుకే అతడు పూర్తిగా వైట్ బాల్ క్రికెట్‍పైనే దృష్టి సారించాలని సూచించాడు. “ఈ విషయం స్పష్టంగా చెబుతా. అతడి (హార్దిక్) టెస్టు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు. ప్రపంచకప్ తర్వాత, పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ అతడు చేపట్టాలి. ప్రపంచకప్‍లో భారత్‍కు రోహిత్ సారథ్యం వహించాలి, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు” అని రవిశాస్త్రి అన్నాడు.
కాగా, యువ ఆటగాడు సంజూ శాంసన్ గురించి కూడా రవిశాస్త్రి మాట్లాడాడు. వెస్టిండీస్‍తో వన్డే సిరీస్‍కు అతడిని ఎంపిక చేయడాన్ని సమర్థించాడు. తన సొంత సామర్థ్యాన్ని సంజూ గుర్తించాలని శాస్త్రి సూచించాడు. కాగా, వన్డే ప్రపంచకప్‍లో బ్యాటింగ్ ఆర్డర్ టాప్-6లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లైనా ఉండాలని అభిప్రాయపడ్డాడు.
“సంజూ శాంసన్ ఇంకా తన స్వీయ సామర్థ్యాన్ని రియలైజ్ అవలేదని నేను అనుకుంటున్నా. అతడు ఓ మ్యాచ్ విన్నర్. అయితే, ఏదో మిస్ అవుతుంది. ఒకవేళ అతడి కెరీర్ అద్భుతంగా ముగియకపోతే నేను నిరుత్సాహపడతా. సంజూ ఓపెనింగ్ బ్యాటింగ్ రోహిత్ శర్మను పోలి ఉంటుంది” అన రవిశాస్త్రి చెప్పాడు.
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ మధ్య వన్డే ప్రపంచకప్ జరగనుంది. కాగా, టీమిండియా తదుపరి వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జూలై 12న ఈ టూర్ మొదలుకానుంది. ఈ పర్యటనలో విండీస్‍తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది భారత జట్టు.