Gambhir on India captaincy: హార్దిక్‌కు పృథ్వీ షా నుంచే పోటీ.. ఇండియన్ టీమ్ కెప్టెన్సీపై గంభీర్
Gambhir on India captaincy: హార్దిక్‌కు పృథ్వీ షా నుంచే పోటీ అని ఇండియన్ టీమ్ కెప్టెన్సీపై గంభీర్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు. అసలు టీమ్‌లో చోటు కోసమే తంటాలు పడుతున్న పృథ్వీ షాను భవిష్యత్తు కెప్టెన్‌గా గంభీర్ చెప్పడం విశేషం.
Gambhir on India captaincy: టీ20 వరల్డ్‌కప్‌లో మరోసారి ఇండియన్ టీమ్ వైఫల్యం తర్వాత కెప్టెన్సీ మార్పుపై చర్చ మొదలైంది. టీ20లకైనా రోహిత్‌ను పక్కన పెట్టి మరొకరికి కెప్టెన్సీ ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేశారు. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు ఇవ్వాలని గవాస్కర్, రవిశాస్త్రిలాంటి క్రికెట్ పండితులు చెప్పారు.
నిజానికి ఐపీఎల్ తర్వాత హార్దిక్‌లోని కెప్టెన్ అందరికీ కనిపిస్తున్నాడు. ఐర్లాండ్, న్యూజిలాండ్ టూర్లలో సిరీస్ విజయాలు కూడా హార్దిక్‌కు ప్లస్ పాయింట్‌గా ఉన్నాయి. అయితే మాజీ ఓపెనర్ గంభీర్ మాత్రం హార్దిక్‌కు ప్రత్యామ్నాయాన్ని కూడా సూచిస్తున్నాడు. కానీ అతని ఛాయిస్ కాస్త ఆశ్చర్యకరంగా ఉంది. చాలా రోజులుగా టీమ్‌కు దూరంగా ఉన్న పృథ్వీ షాలో అతడు భవిష్యత్తు కెప్టెన్‌ను చూడటం విశేషం.
డొమెస్టిక్ క్రికెట్‌లో ఎన్నో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నా.. సెలక్టర్లు అతన్ని కరుణించడం లేదు. ఇప్పుడున్న పోటీలో పృథ్వీ షా మళ్లీ టీమ్‌లోకి ఎప్పుడొస్తాడో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అతడు ఏకంగా కెప్టెన్సీ రేసులో ఉన్నాడని గంభీర్ చెప్పడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన ఫిక్కీ ఈవెంట్‌లో గంభీర్ కెప్టెన్సీపై స్పందించాడు.
"హార్దిక్ పాండ్యా ఎలాగూ రేసులో ఉన్నాడు. కానీ కేవలం ఐసీసీ ఈవెంట్లు చూసి రోహిత్ కెప్టెన్సీని తప్పుబట్టడం దురదృష్టకరం" అని గంభీర్ అన్నాడు. అయితే కెప్టెన్సీ రేసులో పృథ్వీ షా కూడా ఉన్నాడని ఈ సందర్భంగా గంభీర్ అన్నాడు. నిజానికి చాన్నాళ్లుగా పృథ్వీకి టీమ్‌లో చోటు దక్కడం లేదు. ఫీల్డ్ బయట అతని తీరు, ఫిట్‌నెస్ సమస్యలు, డోపింగ్ పరీక్షలో విఫలమవడంలాంటివి విమర్శలకు తావిచ్చాయి.
అయినా గంభీర్ అతని పేరు చెప్పడం చాలామందికి మింగుడు పడలేదు. "పృథ్వీ షా పేరు చెప్పడానికి ఓ కారణం ఉంది. చాలా మంది అతని ఫీల్డ్ బయటి పనుల గురించి మాట్లాడుతుంటారు. కానీ కోచ్, సెలక్టర్లు చేయాల్సింది అదే. కేవలం 15 మంది టీమ్‌ను ఎంపిక చేయడమే సెలక్టర్ల పని కాదు. వాళ్లను సరైన దారిలో ఉంచడం కూడా వాళ్ల పనే. పృథ్వీ షా ఓ దూకుడైన కెప్టెన్. సక్సెస్‌ఫుల్ కెప్టెన్. అతని దూకుడు ఆటలో కనిపిస్తుంది" అని గంభీర్ చెప్పాడు. 2018లో పృథ్వీ షా కెప్టెన్సీలోనే ఇండియన్ టీమ్ అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచింది.
టాపిక్