Rohit Scolds Shardul: శార్దూల్‌పై సీరియస్ అయిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Rohit Scolds Shardul: మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ.. శార్దూల్ ఠాకూర్‌పై సీరియస్ అయ్యాడు. పరుగులు సమర్పిస్తున్న అతడిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Rohit Scolds Shardul: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన మూడో వన్డేలో రోహత్ శర్మ, శుభ్‌మన్ గిల్ శతకాలతో విజృంభించడంతో విజయం భారత్‌కు దక్కింది. దాదాపు మూడేళ్ల తర్వాత రోహిత్ సెంచరీ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అనంతరం బౌలింగ్‌లోనూ భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. శార్దూల్ ఠాకూర్ కీలక సమయంలో మూడు వికెట్ల పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. అలాంటి శార్దూల్‌పై రోహిత్ నిన్నటి మ్యాచ్‌లో సీరియస్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా 27వ ఓవర్ జరుగుతున్నప్పుడు ఆ ఓవర్ వేస్తున్న శార్దూల్ ఠాకూర్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి బౌలింగ్‌లో బౌండరీ వెళ్లడంతో శార్దూల్‌పై కోప్పడ్డాడు. సరిగ్గా బౌలింగ్ చేయాలంటూ సీరియస్ అయ్యాడు. అతడి ఆగ్రహం, నిస్సహాయత హిట్ మ్యాన్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాతే అతడు మెరుగ్గా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.
రోహిత్.. శార్దూల్‌పై మండిపడినప్పటికీ అతడికి మద్దతు ఇస్తున్నారు. హిట్ మ్యాన్ కోపగించుకోవడం వల్లనే శార్దూల్ మూడు వికెట్ల పడగొట్టాడని స్పందిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో శార్దూల్.. డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ వికెట్లు తీశాడు. ఫలితంగా అప్పటి వరకు మెరుగైన స్థితిలో ఉన్న న్యూజిలాండ్ ఓటమి బాట పట్టింది.
మంగళవారం జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(101), శుబ్‌మన్ గిల్(112) సెంచరీలతో విజృంభించగా.. చివర్లో హార్దిక్ పాండ్య అర్ధశతకంతో రాణించాడు. ఫలితంగా భారత్ 385 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్యం ఛేదనంలో న్యూజిలాండ్ 295 పరుగులకు ఆలౌటైంది. డేవాన్ కాన్వే ఒక్కడే శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ నమోదు చేశాడు. చివరగా 2020 జనవరి 7 శతకం సాధించాడు.
సంబంధిత కథనం