Virat Kohli: టీ20లో కోహ్లీని ఎందుకు తప్పించకూడదు.. కపిల్‌దేవ్ సూటి ప్రశ్న-former indian captain kapildev says why can t dropped kohli in t20i squad ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli: టీ20లో కోహ్లీని ఎందుకు తప్పించకూడదు.. కపిల్‌దేవ్ సూటి ప్రశ్న

Virat Kohli: టీ20లో కోహ్లీని ఎందుకు తప్పించకూడదు.. కపిల్‌దేవ్ సూటి ప్రశ్న

Maragani Govardhan HT Telugu
Jul 09, 2022 11:22 AM IST

విరాట్ కోహ్లీ ఫామ్‌పై కపిల్ దేవ్ అసహనం వ్యక్తం చేశాడు. టీ20 జట్టులో కోహ్లీని ఎందుకు తప్పించకూడదని ఆయన అన్నారు. అశ్విన్‌ను టెస్టుల్లో బెంచ్‌కే పరిమితం చేసినప్పుడు కోహ్లీని టీ20లో పక్కన ఎందుకు పక్కనపెట్టకూడదని అన్నారు.

<p>విరాట్ కోహ్లీ</p>
విరాట్ కోహ్లీ (REUTERS)

ఏడాది క్రితం ఏ ఫార్మాట్‌లోనైనా సరే విరాట్ కోహ్లీని జట్టు నుంచి తొలగించడమనే ఆలోచన కూడా కనీసం రాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. టీ20ల్లో విరాట్ కోహ్లీని టీమ్ నుంచి పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కోహ్లీ ఫామ్ అలా ఉంది. గత మూడేళ్ల నుంచి ఒక్క అంతర్జాతీయ సెంచరీ కూడా విరాట్ చేయలేదు. ఈ ఏడాది అతడి ఫామ్ మరింత దిగజారింది. ఈ ఐపీఎల్‌లో అతడు 16 ఇన్నింగ్స్‌ల్లో 115.98 సగటుతో కేవలం 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 11, 20 పరుగులతో మరోసారి విఫలమయ్యాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన దగ్గర నుంచి విరాట్ కేవలం రెండు టీ20 మ్యాచ్‌లే ఆడాడు. దీంతో టీ20ల్లో కోహ్లీ స్థానం గురించి సందిగ్ధత మొదలైంది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ స్పందించారు. అశ్విన్‌ను టెస్టుల్లో బెంచ్‌కే పరిమితం చేసినప్పుడు కోహ్లీని టీ20 జట్టు నుంచి ఎందుకు తప్పించకూడదని ప్రశ్నించారు.

“టెస్టుల్లో ప్రపంచ నెంబర్ 2 బౌలర్ అయిన అశ్విన్‌ను టెస్టు జట్టు నుంచి తొలగించినప్పుడు. టీ20లో ఆడే 11 మంది నుంచి కోహ్లీని బెంచ్‌కే ఎందుకు పరిమితం చేయకూడదు. ప్రపంచ నెంబర్ 2 బౌలర్‌ను పక్కనపెట్టినప్పుడు.. నెంబర్ 1 బ్యాటర్‌ను కూడా వదులుకోవచ్చు. విరాట్ ఇన్నేళ్లుగా బ్యాటింగ్ చేయడం మనం చూసిన స్థాయిలో ప్రస్తుతం లేదు. అతను తన ప్రదర్శనల కారణంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. జట్టులో స్థానం కోసం పోటీ ఉండాలి. విరాట్‌ను అధిగమించేందుకు యువకులు ప్రయత్నించాలి.” అని కపిల్‌దేవ్ తెలిపారు.

వెస్టిండీస్‌లో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో విరాట్ కూడా ఉన్నాడు. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో అతడికి విశ్రాంతి లభించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకవేళ విండీస్‌తో సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతినిస్తే.. అతడిని దూరం పెట్టినట్లే పరిగణించాలని కపిల్ అభిప్రాయపడ్డారు.

"అనేక ఆప్షన్‌లు ఉన్నప్పుడు మీరు ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు అవకాశమివ్వాలి. కేవలం పేరు, ప్రఖ్యాతులను పట్టించుకోకుండా ప్రస్తుతం ఫామ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. మీరు మంచి స్థిరపడిన ఆటగాడే కావచ్చు. కానీ మీరు వరుసగా ఐదు గేమ్స్‌లో విఫలమైనప్పిటీకీ అప్పుడు కూడా ఆడే అవకాశాలుంటాయనేది దీని అర్థం కాదు." అని కపిల్ దేవ్ స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం