FIFA World Cup 2026 schedule: ఫిఫా వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే.. న్యూజెర్సీలో ఫైనల్
FIFA World Cup 2026 schedule: ప్రపంచంలో అతిపెద్ద ఫుట్‌బాల్ టోర్నీ ఫిఫా వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ సోమవారం (ఫిబ్రవరి 5) రిలీజైంది. ఈసారి ఎప్పుడూ లేనివిధంగా ఏకంగా 48 టీమ్స్ ఈ మెగా టోర్నీలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి.
FIFA World Cup 2026 schedule: ఫిఫా వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ను సోమవారం (ఫిబ్రవరి 5) ఫిఫా అనౌన్స్ చేసింది. 48 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో మొత్తం 104 మ్యాచ్ లను మూడు దేశాల్లోని 16 నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక ఈ మెగా టోర్నీ ఫైనల్ నిర్వహించే అవకాశం న్యూజెర్సీకి దక్కింది. అమెరికాతోపాటు కెనడా, మెక్సీకో సంయుక్తంగా ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించనున్నాయి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 షెడ్యూల్
ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఎప్పుడూ లేని విధంగా 2026లో ఏకంగా 48 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకూ టోర్నీలో గరిష్ఠంగా 32 టీమ్స్ పార్టిసిపేట్ చేయగా.. ఈసారి ఆ సంఖ్య 48కి చేరింది. 2026 వరల్డ్ కప్ జూన్ 11న ప్రారంభమై జులై 19న ముగియనుంది. 40 రోజుల పాటు ఈ ప్రపంచ ఫుట్‌బాల్ సంబరం కోట్లాది మంది అభిమానులను అలరించనుంది.
జూన్ 11న మెక్సికో ఆడే మ్యాచ్ తో వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ మెక్సికో సిటీలోని అజ్టెకా స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటికే 1970, 1986 వరల్డ్ కప్ ఫైనల్స్ కు ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. ఇలా మూడు ఫిఫా వరల్డ్ కప్ లలో మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన తొలి స్టేడియంలో అజ్టెకా నిలిచింది. జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది.
ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఎవరికి ఎన్ని మ్యాచ్‌లంటే?
ఫిఫా వరల్డ్ కప్ 2026కు మూడు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. యూఎస్ఏ, కెనడా, మెక్సికోల్లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. టోర్నీలో మొత్తం 104 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో 13 మ్యాచ్ లు కెనడాలోని టొరంటో, వాంకూవర్ లలో జరుగుతాయి. అందులో 10 లీగ్ మ్యాచ్ లు. ఇక మరో ఆతిథ్య దేశం మెక్సికోలోనూ 13 మ్యాచ్ లు జరుగుతాయి.
మెక్సికోలోని మెక్సికో సిటీ, గువాడలజారా, మోంటెర్రీ నగరాలు ఈ మెగా టోర్నీ మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 11న తొలి మ్యాచ్ మెక్సికో సిటీలో జరగనుండగా.. అదే రెండో మ్యాచ్ లో గువాడలజారాలో జరుగుతుంది. ఇక అమెరికాలోని 11 నగరాల్లో మిగిలిన మ్యాచ్ లు జరుగుతుాయి. టొరంటో, మెక్సికో సిటీ, లాస్ ఏంజెల్స్ లలో ఆయా జాతీయ జట్లు తమ తొలి మ్యాచ్ లు ఆడనున్నాయి.
ఫిఫా వరల్డ్ కప్ 2026.. తొలిసారి ఇంత భారీగా..
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ న్యూజెర్సీలో జరగనుండగా.. సెమీఫైనల్ మ్యాచ్ లు అమెరికాలోని అట్లాంటా, డల్లాస్ లలో జరుగుతాయి. మూడో స్థానం కోస మ్యాచ్ మియామీలో జరగనుండగా.. క్వార్టర్ ఫైనల్స్ లాస్ ఏంజిల్స్, కన్సాస్ సిటీ, మియామీ, బోస్టన్ లలో ఉంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో ఏకంగా 48 టీమ్స్ పాల్గొంటున్నాయి.
చివరి 7 వరల్డ్ కప్ లలో వీటి సంఖ్య 32గా ఉండేది. ఈసారి ఏకంగా 16 జట్లు ఎక్కువగా మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. ఎంతో సమ్మిళిత, ప్రభావవంతమైన ఫిఫా వరల్డ్ కప్ ఇదే అని ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాన్‌టినో అన్నారు.
టాపిక్