FIFA World Cup Qualifiers: ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్.. కువైట్‌ను చిత్తు చేసిన టీమిండియా
FIFA World Cup Qualifiers: ఫిఫా 2026 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో కువైట్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఇండియా తరఫున మన్వీర్ ఏకైక గోల్ చేసి గెలిపించాడు.
FIFA World Cup Qualifiers: ఫుట్‌బాల్ లోనూ టీమిండియా విజయం సాధించింది. ఫిఫా 2026 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ రౌండ్ 2 మ్యాచ్ లో కువైట్ ను 1-0తో ఓడించింది. గురువారం (నవంబర్ 16) రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో కువైట్ ను వాళ్ల స్వదేశంలోనే ఇండియన్ టీమ్ చిత్తు చేయడం విశేషం. ఇండియా తరఫున మన్వీర్ సింగ్ గోల్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
కువైట్ లో పెద్ద సంఖ్యలో ఉన్న ఇండియన్ ఫ్యాన్స్.. ఈ మ్యాచ్ లో టీమ్ కు మద్దతుగా నిలిచారు. స్థానిక కువైట్ జట్టు కంటే కూడా ఇండియాకే ఎక్కువ మద్దతు లభించింది. ఈ మధ్యే శాఫ్ కప్ లోనూ కువైట్ ను ఓడించి ఇండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లోనూ అదే రిపీట్ చేసింది.
తాజా మ్యాచ్ లో ఇండియా తరఫున మన్వీర్ సింగ్ ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్ 75వ నిమిషంలో చాంగ్టే ఇచ్చిన క్రాస్ ను మన్వీర్ గోల్ గా మలిచాడు. ఈ గోల్ తోనే ఇండియా 1-0తో విజయం సాధించింది. వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్ లో ఇండియా గ్రూప్ ఎలో ఉంది. ఈ విజయంతో ఈ గ్రూపులో రెండో స్థానంలో నిలిచింది.
గ్రూప్ ఎలో ఇండియా, కువైట్ తోపాటు ఖతార్, ఆఫ్ఘనిస్థాన్ కూడా ఉన్నాయి. గురువారమే జరిగిన మరో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ ను 8-1తో ఖతార్ చిత్తు చేసింది. ఇప్పుడిదే ఖతార్ టీమ్ తో ఈ నెల 21న ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ ఇండియాలోని భువనేశ్వర్ లో జరగనుంది. గ్రూప్ ఎలో పటిష్ఠమైన ఖతార్ జట్టును ఓడించడం ఇండియాకు సవాలే.
ఈ రెండో రౌండ్ లో ప్రతి గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్స్ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మూడో రౌండ్ తోపాటు ఏషియన్ కప్ కు అర్హత సాధిస్తాయి. కువైట్ పై విజయంతో ఇండియా టాప్ 2లో నిలిచే అవకాశాలను మెరుగుపరచుకుంది.