ENG vs IRE: మూడు రోజుల్లోనే ముగించారు: ఇంగ్లండ్ ఘన విజయం.. నాలుగు బంతుల్లోనే టార్గెట్ చేజ్-england resounding victory over ireland debutant tongue takes five wickets ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Eng Vs Ire: మూడు రోజుల్లోనే ముగించారు: ఇంగ్లండ్ ఘన విజయం.. నాలుగు బంతుల్లోనే టార్గెట్ చేజ్

ENG vs IRE: మూడు రోజుల్లోనే ముగించారు: ఇంగ్లండ్ ఘన విజయం.. నాలుగు బంతుల్లోనే టార్గెట్ చేజ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 04, 2023 12:01 AM IST

ENG vs IRE Test: ఐర్లాండ్‍తో ఏకైక టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. మూడో రోజే మ్యాచ్‍ను ముగించేసింది.

ENG vs IRE: మూడో రోజుల్లోనే ముగించారు: ఇంగ్లండ్ ఘన విజయం.. నాలుగు బంతుల్లోనే టార్గెట్ చేజ్
ENG vs IRE: మూడో రోజుల్లోనే ముగించారు: ఇంగ్లండ్ ఘన విజయం.. నాలుగు బంతుల్లోనే టార్గెట్ చేజ్ (Reuters)

ENG vs IRE Test: ఐర్లాండ్‍పై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. నాలుగు రోజుల టెస్టును మూడు రోజుల్లోనే ముగించింది. లండన్‍లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఈ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఐర్లాండ్‍పై ఇంగ్లిష్ జట్టు గెలిచింది. శనివారం రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‍ను 362 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లండ్.. 11 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు బంతుల్లోనే ఛేదించింది.

ఇంగ్లండ్ డెబ్యూ బౌలర్ జోష్ టంగ్ 5 వికెట్లతో విజృభించటంతో రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 362 పరుగులకు పరిమితమైంది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకొని.. ఇంగ్లండ్ ముందు కేవలం 11 పరుగుల స్వల్ప టార్గెట్‍ను విధించింది. ఇంగ్లిష్ ఓపెనర్ జాక్ క్రాలీ.. నాలుగు బంతుల్లోనే మూడు ఫోర్లు బాది లాంఛనాన్ని పూర్తి చేశాడు.

మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజే ఐర్లాండ్‍ను 172 పరుగులకు ఆలౌట్ చేసింది ఇంగ్లండ్. సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత 82.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 524 పరుగుల భారీ స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ రెండో రోజే డిక్లేర్ చేసింది. ఓలీ పోప్ (205) ద్విశతకంతో ఆకట్టుకోగా.. బెన్ డకెట్ 182 పరుగులతో రఫ్పాడించాడు. జో రూట్ అర్ధశతకం చేశాడు. మొత్తంగా 352 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది ఇంగ్లిష్ టీమ్.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 362 పరుగులకు పరిమితమైంది. 8, 9 స్థానాల్లో వచ్చిన యాండీ మెక్ ‍బ్రెయన్ (86 నాటౌట్), మార్క్ అడైర్ (88) పోరాటంతో ఐర్లాండ్ ఆ మాత్రం స్కోరు సాధించగలిగింది. 8వ వికెట్‍కు వారిద్దరూ 163 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ బౌలర్లలో టంగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. 11 పరుగుల లక్ష్యం ఇంగ్లండ్ ముందుండగా.. జాక్ క్రాలీ తొలి నాలుగు బంతుల్లో మూడింటిని బౌండరీలుగా మలిచాడు. ఇంగ్లండ్‍ను గెలిపించాడు. దీంతో మూడో రోజే ఈ టెస్టు మ్యాచ్ ముగిసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఓలీ పోప్‍కు దక్కింది.

Whats_app_banner