ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా(England Vs Australia) మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ (Ashes Series 2023) చివరి దశలో ఉంది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకోవడానికి ఆతిథ్య ఇంగ్లాండ్ రకరకాల కసరత్తులు చేస్తోంది. అయితే చివరి టెస్టు ముగియకముందే ఇంగ్లండ్ జట్టుకు షాక్ ఎదురైంది. ఆ జట్టు అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad) తన వృత్తి జీవితానికి గుడ్ బై చెప్పాడు. ఓవల్‌లో జరుగుతున్న చివరి టెస్టు మూడో రోజు ముగిసిన తర్వాత బ్రాడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
మూడో రోజు అజేయంగా వెనుదిరిగిన తర్వాత స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన స్టువర్ట్ బ్రాడ్, 'చివరి టెస్టుకు ఒక రోజు ముందు నేను తుది నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయాన్ని కెప్టెన్ స్టోక్స్‌కు తెలియజేశాను. నేను ఈ వార్తను బృందంతో పంచుకున్నాను. చివరి టెస్టు యాషెస్‌లో ఆడాలనేది నా కల. అందుకే యాషెస్ సిరీస్‌లో చివరి టెస్టులో రిటైర్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నా.' అని తెలిపాడు.
బ్రాడ్ నిర్ణయం దిగ్భ్రాంతి కలిగించింది. ఎందుకంటే సిరీస్ ప్రారంభానికి ముందు, సిరీస్ ప్రారంభమైన తర్వాత బ్రాడ్ సహచర పేసర్ జేమ్స్ ఆండర్సన్ రిటైర్మెంట్(James Anderson Retirement) గురించి నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన చివరి సిరీస్ గా భావించే ఈ సిరీస్ లో 41 ఏళ్ల అండర్సన్ రాణించలేకపోయాడు. అయితే రిటైర్మెంట్‌ను అండర్సన్ తోసిపుచ్చాడు. కానీ బ్రాడ్ రిటైర్మెంట్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన స్టువర్ట్ బ్రాడ్ 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ తరఫున ఆడటం ప్రారంభించాడు. బ్రాడ్ బౌలింగ్లో 2007లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు(Yuvaraj Singh Six Sixes) బాదడం టీ20 ప్రపంచకప్‌లో చాలా చర్చనీయాంశమైంది. ఇంత జరిగినా నిరుత్సాహపడకుండా, బ్రాడ్ క్రమంగా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్‌గా స్థిరపడ్డాడు. టెస్ట్ క్రికెట్‌లో, ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్‌తో, బ్రాడ్ ఇంగ్లండ్ బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా నిలిచాడు.
ఇంగ్లండ్ తరఫున 167 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బ్రాడ్ ఇప్పటి వరకు 602 వికెట్లు పడగొట్టాడు. యాషెస్ చరిత్రలో 150 వికెట్లు తీసిన తొలి ఇంగ్లిష్ బౌలర్‌గా కూడా నిలిచాడు. అదే సమయంలో బ్రాడ్ 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టీ20ల్లో 65 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లోనూ రాణించిన బ్రాడ్ టెస్టుల్లో 1 సెంచరీ, 13 అర్ధ సెంచరీల సాయంతో 3647 పరుగులు చేశాడు. 2010లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా, యాషెస్ 4 సార్లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.