Donald on Kohli: విరాట్‌ కోహ్లి వికెట్‌ కూడా సచిన్‌లాంటిదే.. వాళ్లవి గొప్ప వికెట్లు: అలన్‌ డొనాల్డ్‌-donald on kohli says its like bowling to sachin ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Donald On Kohli: విరాట్‌ కోహ్లి వికెట్‌ కూడా సచిన్‌లాంటిదే.. వాళ్లవి గొప్ప వికెట్లు: అలన్‌ డొనాల్డ్‌

Donald on Kohli: విరాట్‌ కోహ్లి వికెట్‌ కూడా సచిన్‌లాంటిదే.. వాళ్లవి గొప్ప వికెట్లు: అలన్‌ డొనాల్డ్‌

Hari Prasad S HT Telugu
Dec 21, 2022 03:31 PM IST

Donald on Kohli: విరాట్‌ కోహ్లి వికెట్‌ కూడా సచిన్‌లాంటిదే అని.. వాళ్లవి చాలా గొప్ప వికెట్లు అని అన్నాడు బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌, సౌతాఫ్రికా మాజీ పేస్‌ బౌలర్‌ అలన్‌ డొనాల్డ్‌.

సచిన్ టెండూల్కర్, అలన్ డొనాల్డ్, విరాట్ కోహ్లి
సచిన్ టెండూల్కర్, అలన్ డొనాల్డ్, విరాట్ కోహ్లి (Getty Images)

Donald on Kohli: క్రికెట్‌లో బ్యాట్‌కు, బాల్‌కు సమరం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. క్రికెట్‌ గాడ్‌గా పేరుగాంచిన సచిన్‌ టెండూల్కర్‌కు కొంత మంది బౌలింగ్‌ ప్రత్యర్థులు ఉన్నారు. మాస్టర్‌ వికెట్‌ తీయాలని ఆ బౌలర్లు.. వాళ్ల బౌలింగ్‌లో చెలరేగాలని సచిన్‌ చూసేవాళ్లు. షేన్‌ వార్న్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, బ్రెట్‌ లీలాంటి ఎందరో వరల్డ్‌క్లాస్‌ బౌలర్లు సచిన్‌ వికెట్ కోసం పరితపించేవారు.

వాళ్లలో సౌతాఫ్రికా బౌలర్‌ అలన్‌ డొనాల్డ్‌ కూడా ఒకడు. 1990ల్లో ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌ జరిగినప్పుడల్లా సచిన్‌ vs డొనాల్డ్‌ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. మాస్టర్‌పై పైచేయి సాధించడానికి డొనాల్డ్‌ గట్టిగానే ప్రయత్నించేవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆ దేశంలోనే పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

అప్పుడు ఇండియన్‌ టీమ్‌లో సచిన్‌ ఉన్నట్లే ఇప్పుడు విరాట్‌ కోహ్లి ఉన్నాడు. ఈ ఇద్దరిని పోలుస్తూ.. వాళ్లవి గొప్ప వికెట్లు అని డొనాల్డ్‌ అన్నాడు. వీళ్లకు ఒక్క ఛాన్స్‌ ఇచ్చినా చెలరేగుతారని, మరో అవకాశం బౌలర్లకు ఇవ్వరని చెప్పాడు.

"వాళ్లవి గొప్ప వికెట్లు. నిజమా కాదా? సచిన్‌ బ్యాటింగ్‌కు దిగే సమయంలో చిన్న తప్పు కూడా చేయకుండా బౌలింగ్‌ చేయాలన్న ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు విరాట్‌ కోహ్లి కూడా బ్యాటింగ్‌కు దిగినప్పుడు అతనికి చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే బాధపడతారు. వాళ్లు ఆ తర్వాత మరో అవకాశాన్ని బౌలర్లకు ఇవ్వరు. అయితే ఈ టూర్‌లో మా బౌలర్లు విరాట్‌తోపాటు కేఎల్‌ రాహుల్‌లను బాగానే కట్టడి చేశారు" అని డొనాల్డ్‌ చెప్పుకొచ్చాడు.

"ఈ ప్లేయర్స్‌ క్రీజులోకి వచ్చినప్పుడు వాళ్ల ఉనికిని మీరు గుర్తిస్తారు. ఓ నిజమైన లావాకు బౌలింగ్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సడెన్‌గా టెంపరేచర్‌ పెరిగిపోతుంది. విరాట్‌ రన్స్‌ కోసం ఆకలిగా ఉన్నాడు. ఈ టెస్ట్‌ సిరీస్‌ను సెంచరీతో ముగించాలని పట్టుదలతో అతడు ఉండొచ్చు" అని డొనాల్డ్‌ చెప్పాడు.

రోహిత్‌ లేకపోవడంతో కోహ్లి, రాహుల్ వికెట్లను బంగ్లా బౌలర్లు టార్గెట్‌ చేశారు. అయితే తొలి టెస్ట్‌లో ఈ ఇద్దరూ విఫలమైనా.. పుజారా, శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌లాంటి వాళ్లు సక్సెస్‌ అయ్యారు. అయితే రెండో టెస్ట్‌ మీర్పూర్‌లో జరగనుంది. ఇక్కడ రెండు వరుస మ్యాచ్‌లలో ఇండియాను బంగ్లాదేశ్‌ ఓడించింది. దీనికి తోడు షకీబుల్ హసన్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడం కూడా ఆ టీమ్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారింది. అతడు రెండో టెస్ట్‌లో బౌలింగ్‌ చేస్తాడని కోచ్‌ డొనాల్డ్‌ తెలిపాడు.

WhatsApp channel