Donald issues public apology to Dravid: టీమిండియా కోచ్‌ ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పిన బంగ్లాదేశ్‌ కోచ్‌ డొనాల్డ్‌-donald issues public apology to dravid over an incident happened 25 yeas back ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Donald Issues Public Apology To Dravid Over An Incident Happened 25 Yeas Back

Donald issues public apology to Dravid: టీమిండియా కోచ్‌ ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పిన బంగ్లాదేశ్‌ కోచ్‌ డొనాల్డ్‌

Hari Prasad S HT Telugu
Dec 15, 2022 11:24 AM IST

Donald issues public apology to Dravid: టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు క్షమాపణ చెప్పాడు బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌ అలన్‌ డొనాల్డ్‌. దీని వెనుక 25 ఏళ్ల కిందట జరిగిన ఓ సంఘటనే కారణం కావడం విశేషం.

Allan Donald has aplogised to Rahul Dravid
Allan Donald has aplogised to Rahul Dravid

Donald issues public apology to Dravid: టీమిండియా హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌కు బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ కోచ్‌ అలన్‌ డొనాల్డ్‌ చెప్పాడు. అంతేకాదు అతన్ని డిన్నర్‌కు కూడా ఆహ్వానించాడు. అయితే డొనాల్డ్‌ సారీ చెప్పడేంటి? బంగ్లాదేశ్‌ ప్లేయర్స్‌ ఏమైనా అన్నారా? లేక ఇద్దరు కోచ్‌లు మాటామాటా అనుకున్నారా అన్న సందేహాలు రావడం సహజం.

ట్రెండింగ్ వార్తలు

అయితే డొనాల్డ్‌ క్షమాపణ చెప్పడానికి కారణం 25 ఏళ్ల కిందట జరిగిన ఓ ఘటన కావడం విశేషం. 1997లో ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ద్రవిడ్‌పై డొనాల్డ్‌ నోరు పారేసుకున్నాడు. తాను ఆడే రోజుల్లో తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించడంతోపాటు నోటికి పని చెబుతూ కూడా డొనాల్డ్ భయపెట్టేవాడు.

ఎంతో సౌమ్యుడిగా పేరున్న ద్రవిడ్‌ను కూడా డొనాల్డ్‌ వదల్లేదు. ఆ మ్యాచ్‌లో సచిన్‌, ద్రవిడ్‌ సౌతాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తుండటంతో ఏం చేయాలో తెలియక తాను నోరు పారేసుకున్నానని డొనాల్డ్‌ ఇప్పుడు చెప్పాడు. అంతేకాదు ద్రవిడ్‌కు సారీ కూడా చెప్పడం విశేషం.

"డర్బన్‌లో జరిగిన ఆ ఘటన గురించి నేను మాట్లాడను. ద్రవిడ్‌, సచిన్‌ మా బౌలర్లను బాదేస్తున్నారు. ఆ సమయంలో నేను కాస్త లైన్ దాటాను. ద్రవిడ్‌పై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. ఆ రోజు జరిగిన దానికి నేను మరోసారి ద్రవిడ్‌కు సారీ చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు ఏదో అన్నాను. నిజానికి దాని వల్లే అతని వికెట్‌ కూడా పడింది. కానీ ఆరోజు నేను అన్నదానికి క్షమాపణ కోరుతున్నాను. ద్రవిడ్‌ ఓ అద్భతమైన వ్యక్తి. రాహుల్‌ నేను చెప్పేది నువ్వు వింటూ ఉంటే.. నాతో డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను" అని డొనాల్డ్‌ అన్నాడు.

ఈ వీడియోను ఓ ఇంటర్వ్యూలో భాగంగా ద్రవిడ్‌ చూశాడు. డొనాల్డ్‌ సారీ చెప్పడంపై ముసిముసిగా నవ్వాడు. అంతేకాదు అతని ఆహ్వానాన్ని కూడా మన్నించాడు. "కచ్చితంగా వెళ్తాను. దాని కోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా బిల్లు అతడు కడతానంటే ఎందుకు వద్దంటాను" అని ద్రవిడ్‌ నవ్వుతూ చెప్పాడు.

1997లో జరిగిన ముక్కోణపు సిరీస్‌ ఫైనల్లో ఇండియా, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 278 రన్స్‌ చేసింది. కిర్‌స్టన్‌, కలినన్‌ హాఫ్ సెంచరీలు చేశారు. అయితే తర్వాత వర్షం కురవడంతో ఇండియా టార్గెట్‌ను 40 ఓవర్లలో 252 రన్స్‌గా నిర్ణయించారు. చేజింగ్‌లో గంగూలీని డొనాల్డ్‌ త్వరగానే ఔట్‌ చేశాడు.

కానీ తర్వాత ద్రవిడ్‌, సచిన్‌ సౌతాఫ్రికా బౌలర్లతో ఆటాడుకున్నారు. ఆ మ్యాచ్‌లో డొనాల్డ్‌తోపాటు పొలాక్‌, రూడీ బ్రైసన్‌లాంటి బౌలర్లపై ద్రవిడ్‌ ఎదురు దాడికి దిగాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన డొనాల్డ్‌.. ద్రవిడ్‌ను ఏదో అన్నాడు. అతన్ని డొనాల్డ్‌ ఏమన్నాడు అన్నది ఇప్పటి వరకూ బయటకు రాలేదు. కానీ ఆ సమయంలో ద్రవిడ్‌ చాలా ఆగ్రహంగా కనిపించాడు. డొనాల్డ్‌ బౌలింగ్‌లో ఓ భారీ సిక్స్‌ కూడా కొట్టాడు. ఆ మ్యాచ్‌లో ద్రవిడ్‌ 94 బాల్స్‌లో 84 రన్స్‌ చేసినా.. ఇండియా లక్ష్యానికి 17 పరుగుల దూరంలో ఆగిపోయింది.

WhatsApp channel