Rohit Sharma Out of second test: రోహిత్‌, నవ్‌దీప్‌ ఔట్‌.. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు కొత్త టీమ్‌ ఇదే-rohit sharma and navdeep saini ruled out of second test against bangladesh ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rohit Sharma Out Of Second Test: రోహిత్‌, నవ్‌దీప్‌ ఔట్‌.. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు కొత్త టీమ్‌ ఇదే

Rohit Sharma Out of second test: రోహిత్‌, నవ్‌దీప్‌ ఔట్‌.. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు కొత్త టీమ్‌ ఇదే

Hari Prasad S HT Telugu
Dec 20, 2022 02:31 PM IST

Rohit Sharma Out: రోహిత్‌ శర్మ, నవ్‌దీప్‌ సైనీ బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు కూడా దూరమయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌ కోసం బీసీసీఐ మంగళవారం (డిసెంబర్‌ 20) కొత్త టీమ్‌ను అనౌన్స్‌ చేసింది.

రెండో టెస్టుకూ దూరమైన రోహిత్ శర్మ
రెండో టెస్టుకూ దూరమైన రోహిత్ శర్మ (AP)

Rohit Sharma Out: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండో టెస్ట్‌కు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బొటన వేలి గాయం కారణంగా బంగ్లాతో జరిగిన మూడో వన్డే, తొలి టెస్ట్‌లకు దూరమైన రోహిత్‌.. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో రెండో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని బోర్డు తెలిపింది.

దీంతో కేఎల్‌ రాహులే రెండో టెస్ట్‌కు కూడా స్టాండిన్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. రోహిత్‌ పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ స్పష్టం చేసింది. వచ్చే నెలలో స్వదేశంలో శ్రీలంకతో జరగబోయే సిరీస్‌ సమయానికి రోహిత్‌ ఫిట్‌గా ఉండే అవకాశం ఉంది.

"బొటన వేలి గాయం తర్వాత రోహిత్‌ బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే అతని గాయం పూర్తిగా మానడానికి మరికొంత సమయం పట్టవచ్చని మెడికల్‌ టీమ్‌ స్పష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండో టెస్ట్‌కు కూడా అతడు అందుబాటులో ఉండడు" అని బీసీసీఐ తన ప్రకటనలో వెల్లడించింది.

ఇక మహ్మద్‌ షమి స్థానంలో టీమ్‌లోకి వచ్చిన నవ్‌దీప్‌ సైనీ కూడా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నాడు. అతడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడని, ఇండియాకు తిరిగి వచ్చి నేషనల్ క్రికెట్‌ అకాడెమీలో రిపోర్ట్ చేస్తాడని బీసీసీఐ తెలిపింది. అయితే సైనీ స్థానంలో మరొకరిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇప్పటికే పేస్‌ బౌలర్‌ జైదేవ్‌ ఉనద్కట్‌ టీమ్‌తో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రోహిత్‌ లేకపోవడంతో రెండో టెస్ట్‌లోనూ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. తమ వచ్చిన అవకాశాలను ఓపెనర్‌ శుభ్‌మాన్‌ గిల్‌, మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ సద్వినియోగం చేసుకున్నారు. అటు బౌలర్లు కూడా రాణించడంతో మొత్తంగా తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. మీర్పూర్‌లోనూ తొలి టెస్ట్‌లాంటి కండిషన్సే ఉండనున్నాయి.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు టీమ్‌ ఇదే: కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, ఉమేష్ యాదవ్‌, అభిమన్యు ఈశ్వరన్‌, సౌరభ్‌ కుమార్‌, జైదేవ్‌ ఉనద్కట్‌

WhatsApp channel