KL Rahul on Bazball: ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ స్టైల్‌ బాగుంది.. మేమూ వాళ్లలాగే దూకుడుగా ఆడతాం: రాహుల్‌-kl rahul on bazball style cricket says it is very exciting to watch ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul On Bazball: ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ స్టైల్‌ బాగుంది.. మేమూ వాళ్లలాగే దూకుడుగా ఆడతాం: రాహుల్‌

KL Rahul on Bazball: ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ స్టైల్‌ బాగుంది.. మేమూ వాళ్లలాగే దూకుడుగా ఆడతాం: రాహుల్‌

Hari Prasad S HT Telugu
Dec 12, 2022 03:40 PM IST

KL Rahul on Bazball: ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ స్టైల్‌ బాగుందని అన్నాడు టీమిండియా స్టాండిన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌. తాము కూడా బంగ్లాదేశ్‌పై వాళ్లలాగే దూకుడుగా ఆడతామని చెప్పాడు.

టెస్ట్ సిరీస్ ట్రోఫీతో బంగ్లా, భారత్ కెప్టెన్లు షకీబ్, కేఎల్ రాహుల్
టెస్ట్ సిరీస్ ట్రోఫీతో బంగ్లా, భారత్ కెప్టెన్లు షకీబ్, కేఎల్ రాహుల్ (ANI)

KL Rahul on Bazball: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ ప్రారంభమయ్యే ముందు టీమిండియా స్టాండిన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య టెస్ట్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ పాపులర్‌గా మార్చేసిన బజ్‌బాల్‌పై అతడు స్పందించాడు. ఈ స్టైల్‌ క్రికెట్‌ చూడటానికి చాలా బాగుందని రాహుల్‌ అనడం విశేషం. అంతేకాదు బంగ్లాదేశ్‌పై తాము కూడా దూకుడుగా ఆడనున్నట్లు తెలిపాడు. ఈ స్టైల్‌ క్రికెట్‌తోనే పాకిస్థాన్‌ గడ్డపై ఇంగ్లండ్‌ వరుసగా రెండు టెస్ట్‌లు గెలిచి సిరీస్‌ ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే.

"అది చూడటానికి చాలా చాలా ఉత్సాహంగా ఉంది. పాకిస్థాన్‌తో ఆ రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు బాగున్నాయి. నేను ఈ గేమ్స్‌ చూస్తూనే ఉన్నాను. టెస్ట్‌ క్రికెట్‌ను ఇలా ఆడటం చాలా బాగుంది. భయం లేకుండా, దూకుడుగా ఆడుతున్నారు" అని రాహుల్ అన్నాడు. ఇది నిర్లక్ష్యమైన ఆట అన్న విమర్శలపై కూడా అతడు స్పందించాడు.

"మనం ఎలా చూస్తామన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఓ క్రికెటర్‌గా నాకైతే ఇది నిర్లక్ష్యమైన ఆట కాదు. వాళ్లు ఈ మైండ్‌సెట్‌తో ఆడాలని ముందుగానే అనుకున్నారు. టీమ్‌ కోసం వాళ్ల ప్లేయర్స్‌ అది చేసి చూపెడుతున్నారు. అలా జరుగుతున్నంత కాలం ఎలా చేశామన్నది ముఖ్యం కాదు" అని రాహుల్‌ స్పష్టం చేశాడు.

"ఆ క్రికెట్‌ వాళ్లకు పని చేసింది. ప్రతి టీమ్‌కు ఒక్కో విధానం ఉంటుంది. సక్సెస్‌ అయిన టీమ్స్‌ నుంచి ఒకటో రెండో నేర్చుకోవాలని అన్ని టీమ్స్ భావిస్తాయి. ప్రతిసారీ ఇలాగే ఆడకపోవచ్చు. కండిషన్స్‌ను బట్టి ఆడాల్సి ఉంటుంది. ఇక మేమైతే బంగ్లాదేశ్‌పై దూకుడైన క్రికెట్‌ ఆడబోతున్నాం. అది మీరు చూస్తారు" అని రాహుల్‌ అనడం విశేషం.

ఇక కెప్టెన్‌ రోహిత్‌ గాయం కారణంగా తొలి టెస్ట్‌కు దూరమవడంపై స్పందిస్తూ.. కెప్టెన్‌ గాయపడినప్పుడు అది టీమ్‌పై ప్రభావం చూపుతుందని, అతడు రెండో టెస్ట్‌కు తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఇక విరాట్‌ కోహ్లి తిరిగి టెస్ట్‌ క్రికెట్‌లోకి వస్తుండటంపై కూడా రాహుల్‌ స్పందించాడు. ఈ ఫార్మాట్‌లో అతని ఫామ్‌ ఏమీ ఆందోళన కలిగించడం లేదని చెప్పాడు.

"అతడు చాలా రోజులుగా ఆడుతున్నాడు. చాలా అనుభజ్ఞుడు. అతని మైండ్‌సెట్‌, టీమ్‌ కోసం ఆడే తీరు ఎప్పుడూ ఒకేలా ఉంది. అది అందరికీ కనిపిస్తూనే ఉంది. దానిని ఎవరూ ప్రశ్నించలేరు" అని రాహుల్‌ స్పష్టం చేశాడు.

WhatsApp channel