Dinesh Karthik | కార్తీక్‌ ఇలా ఆడుతున్నాడేంటి.. ఏబీ డివిలియర్స్‌ షాక్-dinesh karthik surprised us all says ab devilliers ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dinesh Karthik | కార్తీక్‌ ఇలా ఆడుతున్నాడేంటి.. ఏబీ డివిలియర్స్‌ షాక్

Dinesh Karthik | కార్తీక్‌ ఇలా ఆడుతున్నాడేంటి.. ఏబీ డివిలియర్స్‌ షాక్

HT Telugu Desk HT Telugu
Apr 19, 2022 09:54 PM IST

ఏబీ డివిలియర్స్‌.. ఆర్సీబీ టీమ్‌కు ఎన్నో ఏళ్ల పాటు వెన్నెముకగా నిలిచిన బ్యాటర్‌. అలాంటి ప్లేయర్‌ కూడా ఇప్పుడు దినేష్‌ కార్తీక్‌ ఆట చూసి షాకవుతున్నాడు.

డివిలియర్స్ నూ ఆశ్చర్యానికి గురి చేసిన కార్తీక్ ఆట
డివిలియర్స్ నూ ఆశ్చర్యానికి గురి చేసిన కార్తీక్ ఆట (PTI)

ముంబై: ఎన్నో ఏళ్ల పాటు ఆర్సీబీ టీమ్‌కు సేవలందించిన సౌతాఫ్రికా ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి కూడా తప్పుకున్న విషయం తెలుసు కదా. అంతటి ప్లేయర్‌ స్థానాన్ని భర్తీ చేయడం ఏ టీమ్‌కైనా అంత సులువు కాదు. కానీ ఆర్సీబీ మాత్రం నక్కతోక తొక్కినట్లుంది. వాళ్లకు దినేష్‌ కార్తీక్‌ రూపంలో ఏబీని మరిపించే ఆటగాడు దొరికాడు. ఎవరూ ఊహించని రీతిలో ఈ సీజన్‌లో చెలరేగుతున్నాడు కార్తీక్‌. ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఆరుసార్లు అజేయంగా నిలవడంతోపాటు 209 స్ట్రైక్‌ రేట్‌తో అతను రన్స్‌ చేయడం విశేషం.

డెత్‌ ఓవర్లలో భారీగా స్కోరు చేస్తూ ఆర్సీబీని గట్టెక్కిస్తున్నాడు. గతంలో ఏబీ డివిలియర్స్‌ కూడా ఇలాగే ఆడేవాడు. 360 డిగ్రీ ప్లేయర్‌గా ఏబీకి పేరుంది. అంటే గ్రౌండ్‌ నలుమూలలా షాట్లు ఆడగలడు అని. ఇప్పుడు కార్తీక్‌ కూడా తక్కువేమీ కాదు. వినూత్నమైన షాట్లతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతని ఆట ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాక్షాత్తూ ఏబీ కూడా డీకేను చూసి షాక్‌ అవుతున్నాడు. మొన్న ఓ మ్యాచ్‌ ముగిసిన తర్వాత కార్తీక్‌తో కోహ్లి మాట్లాడుతూ.. సౌతాఫ్రికాలో కూర్చొని ఏబీ నీ ఆట చూస్తూనే ఉంటాడు అని అన్నాడు.

నిజంగానే ఏబీ అదే పనిలో ఉన్నాడు. అంతేకాదు డీకే ఆటను చూసి ఆశ్చర్యపోతున్నాడు. కొన్నాళ్ల కిందట కామెంటరీ చేస్తూ కనిపించిన ప్లేయర్‌ ఇప్పుడిలా ఆడటమేంటని ఏబీ నోరెళ్లబెట్టాడు. "నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను అసలు ఊహించలేదు. అతని సామర్థ్యం నాకు ఎప్పటి నుంచో తెలుసు. అధిక ఒత్తిడి ఉండే మ్యాచ్‌లను అతడు ఇష్టపడతాడు. క్రీజులో చాలా బిజీగా ఉంటాడు. అయితే అతడు ఈ మధ్యకాలంలో ఎక్కువ క్రికెట్‌ ఆడలేదు. నేను అతన్ని ఐపీఎల్‌ కంటే ముందు చూసినప్పుడు యూకేలో కామెంటరీ చేస్తూ కనిపించాడు. డొమెస్టిక్‌ క్రికెట్‌ కూడా ఎక్కువగా ఆడలేదు. అతను తన కెరీర్‌ చివర్లో ఉన్నాడని అనుకున్నాను. కానీ తన ఎనర్జీతో అతడు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేశాడు" అని ఏబీ డివిలియర్స్‌ అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్