Dinesh Karthik | అతడు ఇండియన్‌ టీమ్‌లోకి తిరిగొస్తాడు: విరాట్‌ కోహ్లి-dinesh karthik presented a very strong case for team india comeback says virat kohli ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dinesh Karthik | అతడు ఇండియన్‌ టీమ్‌లోకి తిరిగొస్తాడు: విరాట్‌ కోహ్లి

Dinesh Karthik | అతడు ఇండియన్‌ టీమ్‌లోకి తిరిగొస్తాడు: విరాట్‌ కోహ్లి

HT Telugu Desk HT Telugu
Apr 17, 2022 04:12 PM IST

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ ప్లేయర్‌ దినేష్‌ కార్తీక్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆ టీమ్‌ మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లి. ఈ సీజన్‌లో అతడు టాప్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

<p>ఆర్సీబీ ప్లేయర్స్ విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్</p>
ఆర్సీబీ ప్లేయర్స్ విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్ (PTI)

ముంబై: దినేష్‌ కార్తీక్‌.. అతడు ఇప్పటి ప్లేయర్‌ కాదు. ఇండియన్‌ టీమ్‌లో తొలిసారి స్థానం కోసం ఎదురుచూస్తున్న యంగ్‌ ప్లేయర్‌ కూడా కాదు. ఇదే టీమిండియా 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు కూడా అతడు టీమ్‌తోనే ఉన్నాడు. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా అతడు యువ ప్లేయర్స్‌కు సవాలు విసురుతున్నాడు. కుర్రాళ్ల ఆటలో మెరుపులు మెరిపిస్తున్నాడు. డెత్‌ ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు అతనో వరంలా మారాడు. 

ఐదు వికెట్లు పడిన తర్వాత కూల్‌గా క్రీజులోకి రావడం, ఆ సమయానికి ఎంత ఒత్తిడి ఉన్నా అదేమీ పట్టనట్లు తన పనేదో తాను చేసుకొని పోవడం కార్తీక్‌కు అలవాటుగా మారిపోయింది. శనివారం ఢిల్లీతో మ్యాచ్‌లోనూ కళ్లు చెదిరే హాఫ్‌ సెంచరీతో టీమ్‌కు భారీ స్కోరు సాధించిపెట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 6 ఇన్నింగ్స్‌లో 197 రన్స్‌ చేశాడు. అయితే అతని స్ట్రైక్‌ రేట్‌ 209గా ఉండటం అసలు విశేషం. దీంతో అతనిపై ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు.

మ్యాచ్‌ తర్వాత ఇద్దరూ బ్రాడ్‌కాస్టింగ్‌ ఛానెల్‌తో మాట్లాడారు. "ఈ టైమ్‌లో నేను మ్యాన్‌ ఆఫ్‌ ద ఐపీఎల్‌తో ఉన్నాను. అతడు ఇలాగే ఆడాలని కూడా చెప్పను. ఎందుకంటే అతడు ఇలాగే ఆడటం కొనసాగిస్తాడు. నువ్వు బ్యాటింగ్‌ చేస్తుంటే చూడటం నిజంగా ఓ గౌరవం. డీకే తన గోల్స్‌ విషయంలో చాలా క్లియర్‌గా ఉన్నాడు. ఇండియన్‌ టీమ్‌కు తిరిగి ఆడటానికి ఏం కావాలో అది చేసి చూపించావు. అత్యున్నత స్థాయిలోనూ నీ ఆటను చూస్తున్నారు. ఏబీ కూడా నీ ఆట చూసి గర్వంగా ఫీలవుతూ ఉంటాడు" అని విరాట్‌ కోహ్లి అన్నాడు.

దినేష్‌ కార్తీక్‌ చివరిసారి టీమిండియాకు 2019 వరల్డ్‌కప్‌లో ఆడాడు. 2004లో తొలిసారి ఇండియన్‌ టీమ్‌కు ఆడిన డీకే.. అప్పటి నుంచీ చాలాసార్లు టీమ్‌లోకి వస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇప్పటివరకూ నేషనల్‌ టీమ్‌ తరఫున 36 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్