Dinesh Karthik: హాఫ్‌ సెంచరీతో ధోనీ రికార్డు బ్రేక్‌ చేసిన దినేష్‌ కార్తీక్‌-dinesh karthik breaks ms dhonis record in t20s ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dinesh Karthik: హాఫ్‌ సెంచరీతో ధోనీ రికార్డు బ్రేక్‌ చేసిన దినేష్‌ కార్తీక్‌

Dinesh Karthik: హాఫ్‌ సెంచరీతో ధోనీ రికార్డు బ్రేక్‌ చేసిన దినేష్‌ కార్తీక్‌

Hari Prasad S HT Telugu
Jun 17, 2022 09:31 PM IST

2006లో టీమిండియా ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లో దినేష్‌ కార్తీక్‌ ఉన్నాడు. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత 37 ఏళ్ల వయసులో కమ్‌బ్యాక్‌ హీరోగా మరోసారి సత్తా చాటాడు.

<p>హాఫ్ సెంచరీ హీరో దినేష్ కార్తీక్</p>
హాఫ్ సెంచరీ హీరో దినేష్ కార్తీక్ (PTI)

రాజ్‌కోట్‌: దినేష్‌ కార్తీక్‌ టీమిండియా జర్నీ ఓ అద్భుతమనే చెప్పాలి. ఎప్పుడో ధోనీ కంటే ముందే ఇండియన్‌ టీమ్‌లోకి వచ్చాడు. 16 ఏళ్ల కిందటే ఇండియా తరఫున తొలి టీ20 ఆడాడు. నిజానికి అదే ఇండియన్‌ టీమ్‌కూ తొలి టీ20. కానీ ఈ 16 ఏళ్లలో అతడు ఆడిన మొత్తం అంతర్జాతీయ టీ20లు కేవలం 36 మాత్రమే. మొత్తానికి ఇప్పుడు తన తొలి హాఫ్‌ సెంచరీ చేశాడు. చాలా లేట్‌గా అయినా ఓ సిక్స్‌తో లేటెస్ట్‌గా ఫిఫ్టీ అందుకున్నాడు.

అతడు ఆడుతున్నంతసేపూ స్టేడియం మొత్తం డీకే.. డీకే.. అన్న అరుపులతో హోరెత్తిపోయింది. సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కార్తీక్‌ కేవలం 27 బాల్స్‌లోనే 55 రన్స్‌ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. తనను బెస్ట్‌ ఫినిషర్‌ అని ఎందుకంటారో ఈ ఇన్నింగ్స్‌తో అతడు మరోసారి నిరూపించాడు. అంతేకాదు ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో అతడు టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనీ రికార్డును కూడా అధిగమించాడు.

టీ20ల్లో హాఫ్‌ సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయసు ప్లేయర్‌గా కార్తీక్‌ నిలిచాడు. ఇన్నాళ్లూ ఈ రికార్డు ధోనీ పేరిట ఉండేది. ధోనీ కూడా సౌతాఫ్రికాపైనే 36 ఏళ్ల 229 రోజుల వయసులో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఇప్పుడు కార్తీక్‌ 37 ఏళ్ల 16 రోజుల వయసులో ఫిఫ్టీ ప్లస్‌ స్కోరు చేసి ధోనీ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఈ ఇద్దరి తర్వాత శిఖర్‌ ధావన్‌ 35 ఏళ్ల 1 రోజు వయసులో ఆస్ట్రేలియాపై హాఫ్‌ సెంచరీ చేశాడు.

ఇండియా 13 ఓవర్లలో 81 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన కార్తీక్‌.. తనదైన స్టైల్లో చెలరేగాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి కాస్త సమయం తీసుకున్న అతడు... తర్వాత రెచ్చిపోయాడు. 26 బాల్స్‌లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. అతని జోరుతో టీమిండియా చివరి 5 ఓవర్లలోనే 73 రన్స్‌ చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం