IPL 2022 | కొవిడ్ భయం.. ఆ మ్యాచ్ పుణె నుంచి ముంబైకి షిఫ్ట్.. అసలు జరుగుతుందా?
IPL 2022 సీజన్‌ను కూడా కొవిడ్ వెంటాడటం ప్రారంభమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మిచెల్ మార్ష్‌తోపాటు మరో ముగ్గురికి కరోనా సోకడంతో లీగ్ షెడ్యూల్‌లో మార్పులు తప్పడం లేదు.
ముంబై: కొవిడ్ కారణంగా ఐపీఎల్ షెడ్యూల్‌లో మరోసారి మార్పులు చేయాల్సి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో కరోనా కలకలం రేపడంతో బుధవారం పుణెలో జరగాల్సిన మ్యాచ్‌ను ముంబైకి తరలించారు. బ్రాబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం సోమవారం ఉదయమే ఢిల్లీ టీమ్ పుణె వెళ్లాల్సి ఉన్నా.. మిచెల్ మార్ష్‌కు కొవిడ్ సోకడంతో ప్రయాణాన్ని రద్దు చేసి ప్లేయర్స్‌ను క్వారంటైన్‌లో ఉంచారు.
మిగతా ప్లేయర్స్‌కు నెగటివ్‌గా తేలినా.. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై నుంచి పుణెకు బస్సు ప్రయాణం అంత సురక్షితం కాదని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భావించింది. దీంతో పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను ముంబైలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు మీడియా ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. అది కూడా బుధవారం ఉదయం మరోసారి ప్లేయర్స్ అందరికీ పరీక్షలు నిర్వహించిన తర్వాతే తేల్చనున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌ను నిర్వహించలేని పరిస్థితి వస్తే రీషెడ్యూల్ చేస్తారు.
ఐపీఎల్‌ను గతేడాది కొవిడ్ భయం ఎలా వెంటాడిందో మనం చూశాం కదా. ఈ మహమ్మారి కారణంగా లీగ్‌ను ఇండియా నుంచి యూఏఈకి తరలించాల్సి వచ్చింది. ఈసారి మూడు వారాలుగా సజావుగా సాగిన ఐపీఎల్‌లో గత వారం మరోసారి కొవిడ్ కలకలం రేపింది. ఢిల్లీ టీమ్ ఫిజియో మొదట కొవిడ్ బారిన పడ్డాడు. అతని నుంచి టీమ్ డాక్టర్‌తోపాటు ప్లేయర్ మిచెల్ మార్ష్‌కూ సోకింది. అతనికి లక్షణాలు కాస్త ఎక్కువగా ఉండటంతో మార్ష్‌ను హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్